ఆస్ట్రేలియా రోడ్లపై పీతల దండు!

17-11-2026 | 05:20am
  1. రహదారులపై కోట్లాది ఎర్ర పీతల ప్రయాణం
  2. నవంబర్‌లో అడవి నుంచి సముద్ర తీరానికి వలస
  3. క్రిస్మస్ ద్వీపంలో ఏటా జరిగే పీతల ప్రయాణం

మెల్బోర్న్, నవంబర్ 16: ఆస్ట్రేలియా రోడ్లపై(Australian roads) ఎక్కడ చూసినా ఎర్ర పీతల దండు(An Army of Red Crabs) కనిపిస్తోంది. రహదారులపై ఎర్రటి తివాచీ పరిచినట్లు కోట్లాది ఎర్ర పీతల సామూహిక వలస వెళ్తున్నాయి. సముద్రం వైపు పరుగులు పెట్టే దృశ్యం ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో(Christmas Island) ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో కనిపించే కోట్లాది ఎర్ర పీతల సామూహిక వలస ఒక అద్భుతం. వర్షాకాలం(Rainy Season) ప్రారంభం కాగానే.. తొలకరి జల్లులు పడగానే.. వేలాది, లక్షలాది పీతలు ఒకేసారి రోడ్లపైకి రావడంతో ఎక్కడ చూసినా పీతల సమూహాలే కనబడతాయి.

రహదారులు, కాలిబాటలు మొత్తం ఎర్రటి రంగులోకి మారిపోతాయి. రోడ్లు, వంతెనలు, అడవి మార్గాలన్నీ ఎర్రటి తివాచీ పరుచుకున్నట్లు కనిపిస్తాయి. సముద్ర తీరంలో గుడ్లు పెట్టేందుకు ఈ పీతలు చేసే సామూహిక ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులను(Nature lovers) ఆశ్చర్యపరుస్తోంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు క్రిస్మస్ ద్వీపానికి వస్తుంటారు. 

నవంబర్ నెలలోనే ఎందుకు?

ఆస్ట్రేలియాలో నవంబర్ నెలలో వర్షాలు ప్రారంభం కావడం, వాతావరణంలో తేమ పెరగడం ఈ పీతల ప్రయాణానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. ముందుగా మగ పీతలు సముద్ర తీరానికి చేరుకొని బొరియలు తవ్వుతాయి. ఆ తర్వాత ఆడ పీతలు అక్కడికి చేరుకుంటాయి. సంభోగం తర్వాత ఆడ పీతలు తమ పొట్ట భాగంలో గుడ్లను మోస్తూ సముద్రానికి దగ్గరగా ఉంటాయి. ఎర్ర పీతల వలసలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం గుడ్లను విడుదల చేసే ప్రక్రియ.

చంద్రుని చివరి పావు దశ సమయంలో, తెల్లవారుజామున సముద్రపు అలలు(Ocean waves) శాంతించినప్పుడు ఆడ పీతలు తమ గుడ్లను సముద్రంలోకి విడుదల చేస్తాయి. ఒక్కో ఆడ పీత లక్షలాది గుడ్లను మోసుకెళ్తుంది. ఈ గుడ్లు సముద్రపు నీటిలోకి చేరిన తర్వాత వాటి నుంచి లార్వాలు బయటికొస్తాయి. అవి సముద్రంలో కొంతకాలం పెరిగి.. చిన్న పీతలుగా మారిన తర్వాత మళ్లీ భూమిపైకి చేరుకుంటాయి. 

రహదారుల మూసివేత

కోట్లాది పీతలు ఒకేసారి రహదారులను దాటుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వాహనాల కింద పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో క్రిస్మస్ ద్వీపం అధికారులు పీతల వలస మార్గాల్లో కొన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తారు.  పీతలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ప్రత్యేక మార్గాలను, ప్రత్యేక వంతెనలు, అండర్ పాస్‌లను నిర్మించారు. 

మరిన్ని వార్తలు