సిద్దిపేటపై ఎందుకింత కక్ష?

17-11-2026 | 05:50am
  1. నా మీద కోపంతో ప్రజలను ఎందుకు బలి చేస్తున్నారు!
  2. రుణమాఫీ, రైతుభరోసా హామీలు ఏమయ్యాయి?
  3.    1,070 కోట్ల పనులు ఎందుకు నిలిపివేశారు?
  4. సిద్దిపేటకు వచ్చేముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
  5. మాజీ మంత్రి హరీశ్‌రావు 
  6. సీఎం పర్యటన నేపథ్యంలో బహిరంగ లేఖ 

సిద్దిపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాపై(Siddipet District) సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం కక్షపూ రితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు(Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులను కొనసాగించాల్సింది పోయి, గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను నిలిపివేయడం, మంజూరైన నిధులను రద్దు చేయడం, రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 19న సిద్దిపేట పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజల పక్షాన బహిరంగ లేఖను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటనలతో ప్రజలకు ఒరిగేదే మీ లేదని, గతంలో రెండుసార్లు వచ్చి ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిలాగే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర జలసంఘం లేఖలతో సహా అసెంబ్లీ సాక్షిగా ఆధారాలు చూపించామని గుర్తుచేశారు. నీళ్లు లేని ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తే ప్రజాధనం వృథా అవుతుందనే ఉద్దేశంతో నీటి లభ్య త ఉన్న ప్రాంతానికి ప్రాజెక్టును మార్చామని తెలిపారు. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని రద్దుచేసి పారదర్శకంగా పనులు చేపట్టామని అన్నారు.

ఏడేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనుమతులు తీసుకురాకుండా కాలయాపన చేసిందని, ఇప్పుడు తమపై నిందలు వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే సిద్దిపేట జిల్లాకు కరువు ఉండదని హరీశ్‌రావు అన్నారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ కింద కాలువల నిర్మాణాన్ని ప్రభుత్వం మూడేళ్లుగా నిలిపివేసిందని ఆరోపించారు. 95 శాతం పూర్తయిన ఇర్కోడ్ లిఫ్ట్ పను ల్లో మిగిలిన ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

గౌరవెల్లి రిజర్వాయర్‌లో నీళ్లు నింపినా కాలువలు తవ్వకపోవడంతో హుస్నాబాద్ ప్రాం తానికి ఒక్క ఎకరాకు కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదన్నారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి వరకు నీటిని తరలించే పను లు, కొండపోచమ్మ కాలువల పనులు నిలిచిపోయాయని విమర్శించారు. దేవాదుల, కాళేశ్వరం, సీతమ్మసాగర్, సమ్మక్క బ్యారేజీ, పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తే కరువును సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉండేదన్నారు.

మూడు పంద్రాగస్టులు గడిచినా అమలు కాలేదేం!

2024 మే 2న సిద్దిపేటకు వచ్చిన సీఎం కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చార ని హరీశ్‌రావు గుర్తుచేశారు. మూడు పంద్రాగస్టులు గడిచినా హామీ పూర్తిగా అమలు కాలేద న్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 20,514 మందికి మాత్రమే రుణమాఫీ కాగా, మరో 22,819 మంది రైతులకు అందలేదని వెల్లడించారు. రెండు లక్షల రూపాయలకు పైగా అప్పు లున్న రైతులు సీఎం మాట నమ్మి అప్పులు తెచ్చి బ్యాంకుల్లో చెల్లించినా వారికి న్యాయం జరగలేదన్నారు. రుణమాఫీ పూర్తిచేసి సిద్దిపేటకు వస్తే తానే స్వయంగా బొకే ఇచ్చి స్వాగతం పలుకుతానని సవాల్ విసిరారు.

ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి?

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని హరీశ్‌రావు మండిపడ్డారు. రూ.4 వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. వృద్ధులు, వితంతువులకు పెరిగిన పింఛన్ బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మాట తప్పారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ కక్షతో సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు హితవు పలికారు. కొడంగల్‌లో తనను ఓడించినందుకు తనపై కోపం ఉంటే తనపైనే చూపించాలని, అమాయక ప్రజలను బలి చేయవద్దని అన్నారు. వ్యక్తిగత విమర్శలు, గడ్డాలు, పొడవుల గురించి మాట్లాడటం మానేసి ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.

ఈ నెల 19న సిద్దిపేటకు వచ్చేలోపు రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాలని, నిలిపివేసిన అభివృద్ధి పనులను పున:ప్రారంభించి రూ.1,070 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

రైతుభరోసా పైసలు ఏవీ!

2026 మార్చి 22న సిద్దిపేటకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి 45 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, 230 రోజులు దాటినా నేటికీ ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు. యాసంగి రైతుబంధు విషయంలోనూ రైతులను మోసం చేశారని ఆరోపించారు.         అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నారు. 

సిద్దిపేట అభివృద్ధికి సంకెళ్లు!

సిద్దిపేటకు మంజూరైన ఔటర్ రింగ్ రోడ్డు, బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, శిల్పారామం, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ విద్యాసంస్థ, స్పోర్ట్స్ స్టేడియం, ఆడిటోరియం తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన సుమారు రూ.1,070 కోట్ల నిధులను నిలిపివేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను పూర్తి చేయాల్సింది పోయి రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తరలించారని, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ 87 నియోజకవర్గాలకు మంజూరు చేసి సిద్దిపేటను విస్మరించారని మండిపడ్డారు.

సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సిద్దిపేట పాఠశాలల్లో అమలు చేయకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం వరకు న్యాయం చేసిందని, కోర్టు ఆదేశాల కారణంగా నిలిచిపోయిన పరిహార ప్రక్రియకు అడ్డంకులు తొలగినా మూడేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిర్వాసితులపై నిజమైన ప్రేమ ఉంటే గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

50 పడకల ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభించి ఏడాది గడిచినా వైద్యసేవలు అందుబాటులోకి రాలేదని, వెయ్యి పడకల ఆసుపత్రి పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట రింగ్ రోడ్డు 90 శాతం పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేయడం లేదన్నారు. నర్సింగ్ కళాశాల భవనం, రంగనాయకసాగర్ టూరిజం ప్రాజెక్టు, పోలీస్ స్టేషన్ భవనాలు, మల్టీపర్పస్ ఆడిటోరియం తదితర పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు