ఫిలిబెక్, రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి
భారత్ సమ్మిట్ నిర్వాహక సంస్థలపైనా క్రిమినల్ కేసులు పెట్టాలి
డీజీపీ సీవీ ఆనంద్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు ఫిర్యాదు
అంతకుముందు ఫిలిబెక్‌పై ఎఫ్‌ఆర్‌ఆర్‌వోలోనూ కంప్లుంట్
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్(Bharath Summit)’లో ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా మాట్లాడారని, దానికి వేదికపై ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముసిముసిగా నవ్వుతూ మద్దతు తెలిపారని.. ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు(Criminal cases) నమోదు చేయాలంటూ డీజీపీ సీవీ ఆనంద్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(N. Ramchander Rao) ఫిర్యాదు చేశారు. సమ్మిట్‌ను నిర్వహించిన సంస్థలపైనా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడి వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడటం ఏమిటని, భారతీయులు వేరే దేశాలకు వెళ్లి అక్కడి వ్యవస్థలను కించపరిస్తే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం రాంచందర్‌రావు నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం డీజీపీని కలిసి ఫిర్యాదును అందజేసింది. అంతకుముందు ఉదయం శంషాబాద్ సమీపంలోని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో)లోనూ కంప్లుంట్ చేశారు. ఇటలీ నేత జియాకోమా ఫిలిబెక్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయనను మరోసారి ఇండియాలో అడుగుపెట్టకుండా డీకోడ్ చేయాలని అందులో పేర్కొన్నారు. రెండు చోట్ల రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు.
అది యాంటీ భారత్ సమ్మిట్
ఇటలీకి చెందిన యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ (పీఈఎస్) సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్, రాహుల్ గాంధీ, ఆ సదస్సు నిర్వాహకులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఏ దేశంలోనైనా వీసా నిబంధనల ప్రకారం ఒక విదేశీయుడు ఆ దేశ గడ్డపైకి వచ్చి అక్కడి అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి గానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి గానీ వీల్లేదన్నారు. కానీ, ఇటలీకి చెందిన జియాకోమో ఫిలిబెక్ భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రపంచం ముందు భారత ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.
వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇద్దరూ ఉన్నప్పటికీ ఆ విదేశీయుడిని అడ్డుకోకపోగా, ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇటలీకి చెందిన వ్యక్తి ఫిలిబెక్ ఇక్కడి వ్యవస్థలను, ఇక్కడి ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే.. వేదికపైనే ఉన్న రాహుల్ గాంధీ నవ్వడం ఏమిటి? అక్కడే ఉన్న రేవంత్‌రెడ్డి చప్పట్లు కొట్టడం ఏమిటి? అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ భారత్ సమ్మిట్. దాని నిర్వాహ సంస్థలపైనా చర్యలు తీసుకోవాల్సిందే’ అని ఆయన డిమాండ్ చేశారు
ప్రధాన ప్రేరేపకుడు రాహులే
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025లోని సెక్షన్ 23 ప్రకారం వీసా నిబంధనలను ఉల్లంఘించి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం శిక్షార్హమైన నేరమని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని రాంచందర్‌రావు అన్నారు. ఈ నేరానికి ప్రత్యక్షంగా ప్రేరేపించిన నిర్వాహక సంస్థలపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. “ముఖ్యంగా ఈ సదస్సును నిర్వహించిన కాంగ్రెస్ థింక్ ట్యాంక్ ‘సమృద్ధి భారత్ ఫౌండేషన్’, కో-స్పాన్సర్ ‘ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్’, అర్బన్ నక్సల్స్ ప్రేరిత వ్యక్తులు, ఈ మొత్తం ఈవెంట్‌ను స్పాన్సర్ చేసిన బెంగళూరుకు చెందిన ‘ఫేజ్ 1’ కంపెనీతో పాటు ఈ కార్యక్రమానికి వేదిక కల్పించిన తెలంగాణ ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాం. ఈ మొత్తం వ్యవహారంలో రాహుల్ గాంధీయే ప్రధాన ప్రేరేపకుడు. ఆయనపై చట్టప్రకారం తప్పకుండా కేసు నమోదు చేయాలి’ అని పేర్కొన్నారు.
మోసపూరితంగా భారత్‌లో ప్రవేశం
ఇటలీలో 4-5 ప్రతిపక్ష పార్టీల కూటమిలో ఉన్న జియాకోమో ఫిలిబెక్ భారతదేశానికి వచ్చి ఇక్కడి అంతర్గత రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయనను స్వయంగా ఇటలీలోని ఇతర నేతలు సైతం తప్పుపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. భారత్ సమ్మిట్ కోసం వచ్చిన విదేశీయులు కూడా ‘కాన్ఫరెన్స్ రూమ్ మీటింగ్’ అని తప్పుడు కారణాలు చెప్పి మోసపూరితంగా భారత్‌లోకి ప్రవేశించారని ఆయన ఆరోపించారు. ‘వీళ్లు భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం వస్తున్నారని చివరి నిమిషంలో తెలియడంతోనే కేంద్ర ప్రభుత్వం 115 మంది వీసాలను విమానం ఎక్కే ముందు రద్దు చేసింది. భారత్ సమ్మిట్ కాదు, పక్కా యాంటీ భారత్ సమ్మిట్’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఉద్యోగాలు, స్కాలర్‌షిప్పుల హమీల అమలుపై బీజేపీ యువమోర్చా నిరసన తెలిపిందే తప్ప, ఎన్నడూ విదేశీయుల ముందు మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. తమ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని.. డీజీపీ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే, బీజేపీ తరపున న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
ఈ దేశ వ్యతిరేక శక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని రాంచందర్ రావు హెచ్చరించారు. డీజీపీని కలిసిన వారిలో రాంచందర్‌రావు వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్ గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, లీగల్ సెల్ సభ్యులు ఉన్నారు.