సందీప్ చుట్టూ సంకటాలు!
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఎక్కువే.. సమన్వయమే పెద్ద టాస్క్!
ఎన్నికల ఒత్తిళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ పగ్గాలు
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(Telangana Congress Party) నూతన ఇన్ఛార్జ్ బీఎం సందీప్(BM Sandeep) ముందు ఎన్నో సవాళ్లు నెలకొన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు(Internal differences) ఎక్కువే. నేతలను సమన్వయం చేసుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద టాస్క్. పైగా, మరో రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనుండటంతో అందరినీ కలుపుకొని పోవడం, పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడం కత్తిమీద సాములాంటిదే. ఇప్పటివరకు ఇన్ఛార్జ్ బాధ్యతలు(In-charge responsibilities) నిర్వహించిన మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) స్థానంలో సందీప్‌ను రెండురోజుల క్రితం ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్(KC Venugopal) నియమించారు.
దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కీలక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇలాంటి కీలకమైన రాష్ట్రానికి యువకుడైన సంస్థాగత నాయకుడిని బాధ్యతల్లోకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పదవి కోసం పలువురు సీనియర్ నాయకుల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాత్రం విధేయత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై అవగాహన, సంస్థాగత నిర్మాణంపై పట్టున్న బీఎం సందీప్ వైపు మొగ్గుచూపింది.
ఆర్భాట రాజకీయాలకు దూరంగా..!
బీఎం సందీప్ కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందినవారు. 2000వ దశకం ప్రారంభంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం భారత యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. చిక్కమగళూరు నగర కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, క్రమంగా పార్టీ సంస్థాగత వ్యవస్థలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ, రాష్ట్ర కన్వీనర్‌గా సందీప్ పనిచేశారు.
సుమారు ఎనిమిదేళ్ల పాటు ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీ వేణుగోపాల్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. పార్టీ నాయకత్వం పట్ల విధేయత, గ్రామస్థాయి నుంచి సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తల సమన్వయం, కేడర్‌ను సమీకరించడం వంటి అంశాల్లో ఆయనకు అనుభవం ఉంది. ఆర్భాట రాజకీయాల కంటే తెరవెనుక ఉంటూ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకుడిగా సందీప్‌కు గుర్తింపు ఉంది.
తెలంగాణలో సవాళ్లు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా సందీప్‌కు ఎదురుకానున్న సవాళ్లు అంత సులభమైనవేమీ కాదు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో బీఆర్ఎస్పై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుని అధికారంలోకి వచ్చింది. మూడేండ్ల పాలన కూడా పూర్తికావొస్తున్నది. మరో రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతర్గతంగా, బహిరంగంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం మధ్య సమన్వయం సాధిస్తూ, పార్టీ సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడం సందీప్ ముందున్న ప్రధాన బాధ్యత. పార్టీలోని వివిధ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం ఆయనకు తక్షణ సవాల్‌గా మారనుంది.
పాత, కొత్త నాయకుల మధ్య విభేదాలు
కాంగ్రెస్‌లో మొదటి నుంచి కొనసాగుతున్న నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతోంది. టీడీపీ నుంచి వచ్చినవాళ్లు, గతంలో బీఆర్ఎస్ లేదా బీజేపీలో పనిచేసి కాంగ్రెస్‌లో చేరిన నాయకుల మధ్య సమన్వయం సాధించడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య విభేదాలు అనేకసార్లు బహిరంగమయ్యాయి. నియోజకవర్గాల పరిధి, మంత్రి పదవులు, స్థానిక రాజకీయ ఆధిపత్యం వంటి అంశాలపై వివాదాలు కొనసాగుతున్నాయి.
క్యాబినెట్లో తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని, ప్రభుత్వ పదవుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వివిధ సామాజిక వర్గాలు, సీనియర్ నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీ కూడా పార్టీలో మరో వివాదాస్పద అంశంగా మారింది. నియామకాల్లో జాప్యం, వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అసమతుల్యత ఉందన్న భావన అసంతృప్తికి కారణమవుతోంది. తోటి నాయకులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేతలపై ఏఐసీసీ సమగ్ర నివేదికలు కోరినట్లు ఇటీవల వచ్చిన వార్తలు పార్టీలో విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి.
బీసీ ఉద్యమాలు..
సామాజిక ప్రాతినిధ్యం
రాష్ట్రంలో బీసీ వర్గాల ఉద్యమాలు బలపడుతుండటం కూడా సందీప్ దృష్టి సారించాల్సిన మరో ముఖ్యమైన అంశం. తెలంగాణ జనాభాలో గణనీయమైన వాటా కలిగిన వెనుకబడిన తరగతులు ఎన్నికల పరంగా కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. రాజకీయ రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్, ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆకాంక్ష, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేయాలన్న ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. అనేక సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
అవినీతి అధికంగా జరుగుతోందన్న ఆరోపణలు, తెలంగాణకు చెందిన స్థానిక పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల కంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ప్రభుత్వ ప్రతిష్ఠను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా తీవ్ర స్థాయికి చేరకపోయినప్పటికీ, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం, జవాబుదారీతనం వంటి అంశాల చుట్టూ క్రమంగా రూపుదిద్దుకుంటోంది.
ఆర్థిక వనరుల కొరత..
జాతీయ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయిలో నిధుల కొరత ఉంటే పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల సన్నాహాలు, సంక్షేమ పథకాల ప్రచారం, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. మరోవైపు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఇతర పార్టీలకు వలసలు కూడా కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి.
బీఆర్ఎస్, బీజేపీ రెండూ రాష్ట్రంలో తమ రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ బీఆర్ఎస్కు పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బలమైన సంస్థాగత పునాది, నిబద్ధత కలిగిన ఓటు బ్యాంకు ఉంది. మరోవైపు బీజేపీ కూడా క్రమంగా తన రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లోపాలు, వివిధ సామాజిక వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
అనుభవం ఉపయోగపడేనా?
గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సందీప్‌కు ఉన్న సంస్థాగత అనుభవం తెలంగాణలో ఉపయోగపడవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ సామాజిక, రాజకీయ సమీకరణాలు, పార్టీలో అంతర్గత వర్గపోరు వంటి సమస్యలు సంక్లిష్టంగా ఉంటాయి. అక్కడ పనిచేసిన అనుభవం తెలంగాణలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దోహదపడవచ్చు. కేసీ వేణుగోపాల్‌తో సన్నిహిత సంబంధాలు, కేంద్ర నాయకత్వం పట్ల విధేయత ఆయనకు పార్టీ అధిష్ఠానం మద్దతును అందించనున్నాయి.
వివిధ వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించి సమన్వయం సాధించేందుకు ఈ మద్దతు కీలకంగా మారనుంది. క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం కలిగిన యువ నాయకుడిగా సందీప్ ప్రధానంగా బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేయడం, మంత్రులు-, పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచడం, నామినేటెడ్ పదవులు, సంస్థాగత నియామకాలను అసంతృప్తిని పెంచే విధంగా కాకుండా అన్ని వర్గాలను కలుపుకుపోయేలా చేపట్టడంపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
సందీప్ సామర్థ్యానికి పరీక్ష
ఈ బాధ్యతలో సందీప్ విజయం సాధించాలంటే వివిధ వర్గాల మధ్య నిష్పక్షపాతంగా వ్యవహరించే సమన్వయకర్తగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ముఖ్యమంత్రి బృందం చూపుతున్న దూకుడు నాయకత్వానికి, సీనియర్ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధుల ఆకాంక్షలకు మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు, పక్షపాతం, అవినీతి ఆరోపణలపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను కూడా చక్కదిద్దాలి.
అదే సమయంలో పార్టీలోని అంతర్గత విభేదాలు బహిరంగంగా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయకుండా, రాబోయే ఎన్నికల సమరానికి కాంగ్రెస్ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. బీఎం సందీప్ నియామకం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఈ దశలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కంటే సంస్థాగత నైపుణ్యం, పార్టీ పట్ల విధేయతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ నిర్ణయం తెలియజేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రస్తుతం అధికారం ఒక అవకాశమైతే, దానిని నిలబెట్టుకోవడం పెద్ద పరీక్షగా మారింది.
సందీప్ పార్టీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్ది, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంలో ఉన్న లోపాలను సరిదిద్ది, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు, పార్టీ కార్యకర్తల సమీకరణపై దృష్టి సారించగలిగితే కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే దిశగా మరింత బలపడుతుంది.అయితే, పార్టీలో వర్గపోరును నియంత్రించడంలో విఫలమైనా, వివిధ సామాజిక వర్గాల అసంతృప్తిని, ప్రభుత్వ పనితీరుపై పెరుగుతున్న విమర్శలను పరిష్కరించలేకపోయినా ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న రాజకీయ ప్రయోజనాలు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
రాబోయే రెండేళ్లు తెలంగాణ కాంగ్రెస్‌కు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ కాలంలో బీఎం సందీప్ చేపట్టే సంస్థాగత ప్రక్షాళన పార్టీకి అవసరమైన ఐక్యతను, సమన్వయాన్ని అందిస్తుందా? లేక అంతర్గత విభేదాలు మరింత ముదిరి పార్టీకి నష్టం కలిగిస్తాయా? అన్నది రాబోయే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రధాన అంశంగా మారనుంది. గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీగా వ్యవహరించిన మీనాక్షి నటరాజన్ నిజమైన గాంధేయవాది. అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకురాలిగా ఆమెకు పేరుంది.
బహుశా ఇదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడితో ఆమె విబేధాలకు కారణమై ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్తున్నారనే కారణంతో ఆమెను బాధ్యతల నుంచి తప్పించారా.. అన్న సందేహాలుకూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు యువకుడైన బీఎం సందీప్‌కు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. సంస్థాగత వ్యవహారాల్లో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికలే తొలి పరీక్ష
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర కాంగ్రెస్ సంస్థాగత సామర్థ్యానికి తొలి పరీక్షగా నిలవనున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అంతర్గత విభేదాలు మరింత పెరగకుండా చూడటం, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించడం సందీప్ ముందున్న తక్షణ బాధ్యత. ఆ తర్వాత బీఆర్ఎస్, బీజేపీలతో నేరుగా తలపడేందుకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. ఇందుకోసం కేడర్‌లో క్రమశిక్షణ పెంచడం, ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడం, స్థానిక స్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం, 2023లో కాంగ్రెస్ విజయానికి కారణమైన విభిన్న సామాజిక వర్గాల మద్దతును నిలబెట్టుకోవడం అత్యవసరం.