ఓట్ ఫర్ జాబ్!

06-10-2026 | 05:40am

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్లు వేయాలి 

నిరుద్యోగుల డిమాండ్ 

  1. అధికార, ప్రతిపక్షాల అభ్యర్థులకు సవాల్‌గా పట్టభద్రులు
  2. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ఆగ్రహం
  3. ముందు నోటిఫికేషన్.. తర్వాతే ఓటు అడగాలంటూ అల్టిమేటం
  4. దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ జేఏసీ, యువత 

అక్టోబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) వేడి అప్పుడే మొదలైంది. అయితే ఈసారి గ్రాడ్యుయేట్ ఓటర్లు(Graduate voters), ముఖ్యంగా నిరుద్యోగ యువత(Unemployed youth) ఒక స్పష్టమైన నినాదంతో ముందుకొస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party)(సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఆందోళనల తర్వాత యువతలో, నిరుద్యోగుల్లో చాలా చైతన్యం వచ్చిందనే చెప్పాలి. తమకు ఏం కావాలో ప్రభుత్వాన్ని బహిరంగంగానే నిలదీస్తున్నారు.. ప్రశ్నిస్తున్నారు కూడా.

ఈక్రమంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణ యువత, గ్రాడ్యుయేట్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్స్ ఫస్ట్.. ఓటు నెక్స్ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతామని అధికార పక్షానికి, తమతో కలిసి రావాలని ప్రతిపక్షాలకు నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. దశలవారీ పోరాటాలకు సన్నద్ధమవుతున్నారు. 

కోడ్ కంటే ముందే..

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల స్థానాలకు వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనన్నాయి. ఓటరు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే పోటీదారుల పేర్లను సైతం ప్రకటించింది. బీఆర్‌ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా ఈ మూడు పార్టీలకు కీలకం కానున్నాయి. రాబోయే హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, పలు మున్సిపాలిటీల ఎన్నికలతోపాటు, 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

అందుకే ఈ ఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయించి, ఆతర్వాతే ఓట్లు అడగాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్లు వేసేలా గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు. అప్పటిదాకా ఓటు అడగొద్దని హెచ్చరిస్తున్నారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లు, డీఎస్సీ, జీపీవో నోటిఫికేషన్లతోపాటు, గ్రూప్ 1, 2, 3, 4, డిగ్రీ లెక్చరర్, యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముడిపెడుతున్నారు.   

ఓటుతోనే సమాధానం ..

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరలేదని, మళ్లీ అదే మోసం చేస్తే ఊరుకునేది లేదని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. అది గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అయినా...ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా...లేకుంటే రేపు అధికారం మాది అని చెప్పుకునే బీజేపీ అయినా...అభ్యర్థులు బాహాటంగానే నిలదీస్తున్నారు. పోలీస్ నియామక ప్రక్రియలకు సంబంధించి వయోపరిమితి పెంపు విషయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఎమ్మెల్సీ ప్రొ.కోదండ రామ్‌ను నిరుద్యోగ యువత నిలదీసిన అంశం ఇటీవల హాట్‌టాపిక్‌గా మారింది.

60 ఏళ్లు పైబడిన మీరు ఎమ్మెల్సీగా చట్ట సభలకు వెళ్లొచ్చు...ముప్పు ఏళ్లు దాటిన తాము పోలీసు ఉద్యోగాలకు పనికిరామా? అంటూ యువత గట్టిగానే నిలదీయడంతో వెంటనే ప్రభుత్వం దిగొచ్చి అసెంబ్లీ సమావేశాల సమయంలో వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలప్పుడు హామీలివ్వడం...అవి పూర్తయ్యాక వాటిని పట్టించుకోకపోవడం అభ్యర్థులకు సర్వసాధారణమైందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై హామీలతో మోసాలు చేస్తే ఊరుకునేది లేదని, ఓటుతోనే సమాధానం చెప్తామని హెచ్చరిస్తున్నారు. 

దశలవారీ ఆందోళనలకు వ్యూహాలు..

రాష్ట్రంలో లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కూడా అటకెక్కింది. ప్రతి ఎమ్మెల్సీ, ఇతర ఎన్నికలప్పుడు నేతలు వచ్చి ‘అసెంబ్లీలో మీ గొంతుకై నిలుస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా’ అని హామీలు ఇచ్చి వెళ్తున్నారు. కానీ గెలిచాక మాత్రం మాట తప్పుతున్నారనే ఆరోపణ ఉంది. అందుకే ఈసారి యువత డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే పెండింగ్‌లో ఉన్న అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే దశలవారీగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సోమవారం తలపెట్టిన సీఎం ఇళ్లు ముట్టడి కార్యక్రమాన్ని నవంబర్ 6కు నిరుద్యోగ జేఏసీ వాయిదా వేసుకుంది. అయితే దిల్‌సుఖ్‌నగర్, అశోక్ నగర్‌లో ర్యాలీలు, నిరసనలను మాత్రం దశలవారీగా త్వరలోనే చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు