సక్సెస్ కోసం మళ్లీ మళ్లీ.. కొత్తగా వెతుక్కోవాల్సిందే!
సినిమా ప్రపంచంలో హీరోగా మాత్రమే కాదు ఒక నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రాజీవ్ కనకాల(Rajiv Kanakala). 250కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. 35 ఏళ్లకుపైగా సినీ ఇండస్ట్రీలో(Film industry) ప్రయాణం సాగిస్తున్న ఆయన కెరీర్‌లో ఎన్నో మలుపులు, విజయాలు, వైఫల్యాలు. ఆ విషయాన్నీ ‘విజయక్రాంతి’(Vijayakranthi)తో పంచుకున్నారు. ఆ విశేషాలివీ..
ఇండస్ట్రీలో 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం:
35 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం(Cinematic Journey) సంతోషంగా ఉంది. చాలామంది వేషాలు వేయాలని బోలెడన్ని ఆశలతో ఇండస్ట్రీలోకి వస్తారు. కొంతమందికి కొన్నేళ్లు మాత్రం కుదురుతుంది, మరికొందరికి పాతికేళ్లకు కుదురుతుంది. ఇంకొంత మంది 30 ఏళ్లు ఉండగలుగుతారు. అక్కినే నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) లాంటి వాళ్లు బహుశా 75 ఏళ్లపాటు ఇండస్ట్రీలోనే ఉన్నారు. అది చాలా అరుదు. నేను 35 ఏళ్లుగా ఉండగలిగానంటే విభిన్న పాత్రలు పోషించగలుగుతాన్న నమ్మకం మేకర్స్‌లో రావడం నా అదృష్టంగా భావిస్తాను.
థియేటర్, ఓటీటీ.. వ్యత్యాసమేమీ లేదు:
ఇప్పుడు థియేటర్లలో వచ్చే సినిమాల్లాగే ఓటీటీ సినిమాలకూ(OTT movies) ఆదరణ చాలా ఉంటుంది. ఈ రెండింటికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు. సినిమాకు కష్టపడ్డట్టే ఓటీటీకీ కష్టపడాలి. ఓటీటీ ఒరిజినల్స్ వాళ్లు డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు కాబట్టి థియేటర్‌లో రిలీజ్ కాకపోవచ్చు అంతే. అయితే, ఇటీవల థియేటర్‌లో రిలీజ్ అయితే గానీ ఓటీటీకి తీసుకోవట్లేదు. అందుకే కొన్ని ఛానల్స్ వాళ్లు ఓటీటీ కోసమే సినిమాలు, సిరీస్‌లు చేయించుకుంటున్నారు. అయితే సిరీస్‌ను కూడా సినిమా క్వాలిటీతో చేయాలి. లేకపోతే ఎవరూ తీసుకునేందుకు ముందుకు రారు.
ఎక్స్‌పీరియన్స్ కోసం థియేటర్‌కు..
ఓటీటీలు ఆదరణ పొందుతున్న కారణంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు చాలా వరకు ప్రాధాన్యత పెరిగిందని ఎవరైనా అంటే అది 100% వాస్తవం. ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కే కాదు నటీనటులు, హీరోలు, కమెడియన్ ప్రాముఖ్యత పెరిగింది. ఇండస్ట్రీ చాలా కలకళలాడుతుంది. ఇక థియేటర్లకు ఎవరూ రారు, అందరూ ఓటీటీలోనే చూస్తారనుకున్నా. ఇప్పుడు అలా లేదు. ఓటీటీలోకి వస్తుందని తెలుసు. అయినా థియేటర్‌లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో చీకట్లో ఒంటరిగా చూసేకన్నా అందరితో కలిసి చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుందని, బిగ్‌స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసం కుటుంబంతో సహా వచ్చేస్తున్నారు. సో ముందుగా వాళ్లందరికీ థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే, ఆ రెండింటి మధ్య తేడాను వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు.
సినిమా స్థాయిని నిర్ణయించేది కంటెంటే..
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు చాలా ప్రాధాన్యత పెరిగింది. మంచి కంటెంట్ కూడా చిన్న సినిమాల్లోనే దొరుకుతోందనేది నిజం. అయితే ఇక్కడ చిన్న, పెద్ద అని తేడా లేదు. కంటెంట్ బాగుంటే సినిమా బాగా ఆడుతుంది. బాగాలేకపోతే పెద్ద సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది. కథను సరిగ్గా తెరెక్కించకపోయినా, పాత్రల్లో బలం లేకపోయినా, ఆ పాత్రలకు తగ్గట్టు నటులు కుదరకపోయినా, నటులు సిన్సియర్‌గా, సహజంగా నటించకపోయినా ఆ సినిమా జనాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు నాకు ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కోసం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది. గతంలోనూ నాకు ‘సై’ సినిమాకు ఇచ్చారు.
అవన్నీ నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలే:
నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ ఇది అని చెప్పాలంటే.. ‘సై’, ‘విక్రమార్కుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాల్లో ఉన్నాయి. అయితే ‘నాన్నకు ప్రేమతో’లో కొంచెం గ్రే షేడ్ ఉన్నా, అది కూడా నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉందని చెప్పొచ్చు. ఇంకా ‘స్టూడెంట్ నెంబర్ వన్’లో ఉన్న పాజిటివ్ యాంగిల్ దగ్గరగానే ఉంటుంది. ‘నువ్వే నువ్వే’.. ఇలా మంచి క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. అన్నీ మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఎప్పటికప్పుడు మనల్ని కొత్తగా మలుచుకోకుంటే అంతే!
ఒక నటుడికి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఇన్‌సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత పేరు వచ్చినా, ఎంతమంది ఆహా ఓహో అంటున్నా ఆ భావన ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు. బహుశా నాకు సక్సెస్ వచ్చి ఈ ఊపు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కంటిన్యూ అవ్వచ్చేమో, సడన్‌గా ఓవర్ ది నైట్ పోవచ్చేమో లేకపోతే ఇంకో కొత్త ఒరవడి సృష్టించిన నటుడు రావచ్చేమో, మేకర్స్ అందరూ సడన్‌గా అటు వెళ్తారేమో. సో ఇక్కడ మనల్ని మనం ఎప్పుడూ కొత్త గా ఏదైనా క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ కోసం ట్రై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటేనే సుదీర్ఘ కాలం ఇక్కడ ఉండగలం.
లేకపోతే అంతే ఇక. నేను సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను రెండింటినీ సమానంగా స్వీకరిస్తా. నాకు పెద్ద సక్సెస్ వచ్చింది కదా అని ఊగిపోను. ఫెయిల్యూ ర్ వచ్చింది కదా అయ్యో అని బాధపడను. రెండు వస్తాయి. రెండు సమానంగా తీసుకోవడం మా నాన్న నుంచి నేర్చుకున్నా. మా నాన్న స్టూడెంట్స్‌కూ ఇదే చెప్పేవారు. ‘రేయ్ సక్సెస్ వచ్చిందని మీకు గర్వం వచ్చేయకూడదు, కళ్లు నెత్తికెక్కకూడదు. ఒకటి చేశావు బాగుంది, తర్వాత మళ్లీ మరుసటి రోజు ఇంకో షూటింగ్‌కి వెళ్లాల్సిందే, అది కొత్తదే, ఇంకో సక్సెస్ కోసం వెతుక్కోవడమే’ అనేవారు. అందుకే సక్సెస్ కోసం మళ్లీమళ్లీ నేను కొత్తగా వెతుక్కోవాల్సిందే.
తొలుత మా ఇల్లు, ఇన్‌స్టిట్యూట్ వేర్వేరుగా ఉండేవి. సొంత ఇన్‌స్టిట్యూట్ పెట్టిన తర్వాత అదే ఇల్లు అదే, ఇన్‌స్టిట్యూట్ అదే. నేను చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరిగాను. నేను స్కూల్ నుంచి రాగానే ఆ క్లాసుల్లో ఎంటర్ అయిపోయేవాన్ని. అవన్నీ చేయడం అదృష్టం. ఆడవాళ్లకు, మగవాళ్లకు రూమ్స్ కూడా వేర్వేరుగా ఉండేవి. వాళ్లు కాకుండా నేను, మా చెల్లెలు, మా నాన్న, మా అమ్మ, పనివాళ్లు.. ఇంతమంది ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. సాయంత్రం ఇన్‌స్ట్టిట్యూట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్లతో సరదాగా గడిచిపోయేది. అందరూ కలిసి కూరగాయలు తరిగేవారు, వంటకు సహాయం చేసేవాళ్లు. తొలుత వంట చేసేందుకు కిష్టయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ తర్వాత అందరికీ అమ్మే వంట చేసేది. పొద్దున నాలుగు గంటలకు లేచి కూరగాయలు తరుక్కొని, అన్ని మేడమ్ చేసుకొనేదని చాలా మంది స్టార్స్ కూడా ఇంటర్వ్యూల్లో చెప్పడం విన్నా.
కూరగాయలు నాలా ఎవరూ కోయలేరు:
ముందు నేను బాగా తినేవాడిని కాదు. మా నాన్న ఫుడ్డీ, బ్రహ్మాండంగా వండేవాడు కూడా. నాకు వంట రాదు. కానీ ఆమ్లెట్ వేయడం, దోస వేయడం వచ్చు. కూరగాయలు అద్భుతం కోస్తా. అంటే ఆడవాళ్లు కూడా అంత బాగా కోయలేరు. అది మా కిష్టయ్య దగ్గర నేర్చుకుంది.
నాన్న జీవిత పాఠాలూ నేర్పారు:
నాన్న డైరెక్షన్‌లో కూడా నేను పనిచేశారు. సీరియల్స్ చేశాం. ఆయన బాగా స్ట్రిక్ట్. ఎంత అంటే కొడుకైనా, స్టూడెంట్ అయినా ఒకటే పద్ధతి. నటనలో మెళకువలే కాదు, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం అలవాటు చేసుకున్నాం. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వాడినప్పుడు, రేపు ఇంకా పెద్ద సమస్య వచ్చినా ఈజీగా బయట పడగలం అని చెప్తూ మమ్మల్ని ట్రైన్ చేశాడు మా నాన్న. అప్పుడు అలాంటివి నేర్చుకోవడం వల్ల జీవితంలో ఇప్పుడు ఇలా ముందుకు సాగుతున్నాం.
అందరికీ 24 అవర్స్.. సుమకి 48 అవర్స్
ఆవిడ (సుమ)కు మరి ఎలా ఉంటుందో తెలియదు, దాదాపు 48 అవర్స్ కింద లెక్క. ఏదో ఒకటి కంటిన్యూస్‌గా చేస్తూనే ఉంటుంది. తను చేస్తున్న యాంకరింగ్‌కి సంబంధించింది రాసుకుంటూ ఉంటుంది. ఇంటర్వ్యూ గురించి, ప్రీ రిలీజ్ గురించి.. ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కోసం స్క్రిప్ట్.. ఇవన్నీ కాకుండా ఫుడ్ ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఎవరికో సమస్య, ఏదో ఫంక్షన్, ఎవరో సాయం కోసం వస్తారు.. అన్నీ చూసుకుంటూ ఉంటుంది. తద్వారా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా మారింది. మగవాళ్లకు కూడా అని ఖచ్చితంగా చెప్పగలను.
ఎన్టీఆర్‌తో గొడవ ఫ్రెండ్‌షిప్‌గా మారింది:
ఎన్టీఆర్‌తో నా ఫ్రెండ్‌షిప్ ఏదో గొడవతో మొదలైంది. తర్వాత క్లోజ్ అయ్యాం. అది 25 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు మేం హ్యాపీ. ‘నువ్వు పెద్ద టాప్ స్టార్ అవుతావ్, ఆ తర్వాత మమ్మల్ని కూడా మర్చిపోవాలని కోరుకుంటున్నాను’ అని ఓసారి అన్నాను. కానీ మర్చిపోలేదు. ఎప్పుడో కుదిరినప్పుడు తనే ఫోన్ చేసి పిలుస్తాడు, వెళ్తుంటాం. రోజు మాట్లాడుకుంటే ఫ్రెండ్‌షిప్ అవ్వాల్సిన అవసరం లేదు. మనసులో ఎక్కడో చోట ఉండి ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఠక్కున గుర్తుకొచ్చే వ్యక్తి అవ్వాలి. అదే ఫ్రెండ్‌షిప్. అలా చాలా మంది ఉన్నారు.
ఈ రోజుల్ని అప్పుడే ఊహించారు:
చిన్న ప్లాట్‌ఫామ్స్ గురించి మా నాన్న దూరదర్శన్ ఉన్న కాలంలోనే చెప్పేశాడు. అదే ఇప్పుడు ఓటీటీ. ‘ఈ టెలివిజన్ అన్నది ఒక రెవల్యూషన్‌లాగా తయారవుతుంది, చాలా వస్తాయి ప్రైవేట్ ఛానల్స్ కూడా వస్తాయి. అప్పుడు కూడా అందరికీ ఉపాధి ఉంటుంది, అందరూ సినిమాకే వెళ్లాలని రూల్ లేదు, టెలివిజన్ యాక్టర్స్‌గా సంపాదించుకోవచ్చు’ అంటూ బాగా ఎంకరేజ్ చేసేవాడు. అలా కొద్ది కాలానికే దూరదర్శన్ ఉంది, ఈటీవీ, జెమినీ లాంటి ప్రైవేట్ ఛానల్స్ వచ్చేశాయి. కట్ చేస్తే మళ్లీ ‘జీ’, ‘మా’ టీవీ, న్యూస్ ఛానల్స్.. అన్నీ వచ్చేశాయి. మా నాన్న అప్పటికే ఇదంతా ఊహించాడు.