లో వోల్టేజ్‌.. రైతులకు ఎందుకింత కష్టం?

01-10-2026 | 03:37pm

గంభీరావుపేట, ఆగస్టు 01 (విజయక్రాంతి): విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కామారెడ్డి–సిద్దిపేట ప్రధాన రహదారిపై కాలిపోయిన మోటార్లను ఉంచి రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని, లో వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోతుండటంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్నా (PROTEST) సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎస్సై శ్రీకాంత్, సీఐ వెంకటేష్, విద్యుత్ ఏఈ ఆనంద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది.విద్యుత్ సమస్య (ELECTRICITY PROBLEM)ను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా (POWER SUPPLY) అందించాలని, లో వోల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కొక్కు దేవేందర్ యాదవ్, గంట అశోక్, కోడె రమేష్, ప్రసాద్ రెడ్డి, పొన్నాల మహేష్, డాక్టర్ సత్యనారాయణ, మల్లయ్య, ప్రశాంత్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను అధికారులు త్వరగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు