గ్రామాభివృద్ధి ఇక గ్రామస్థుల చేతుల్లోనే!

01-10-2026 | 04:07pm

బోథ్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వం విజీపీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులే తమ అవసరాలను చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఎంపీడీవో ఎల్. రమేష్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో సర్పంచ్ బృహ విశ్వేశ్వర్ అధ్యక్షతన వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పై స్థాయిలో నిధులు వస్తేనే గ్రామాలకు నిధులు మంజూరు అయ్యేవని, అయితే గ్రామపంచాయతీ ప్రణాళిక ద్వారా మన గ్రామంలో పనులను నిర్ణయించి వాస్తవ అవసరాలను గుర్తించి పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. మన వనరులను మనమే గుర్తించి పనులు పూర్తి చేసుకోవచ్చన్నారు. 375 రకాల పనులకు ఈ ప్రణాళికలో మోక్షం లభిస్తుందని తెలిపారు.

మౌలిక వసతులు (INFRASTRUCTURE), నీటి భద్రత, పర్యావరణం తదితర కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, మురుగునీటి కాలువలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి వ్యక్తికి కూలి లభించేలా ప్రణాళికలు (PLANS) రూపొందించుకోవాలని సూచించారు.

గ్రామ అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని ఎంపీడీవో సూచించారు. ప్రణాళిక అమలులో గ్రామస్తుల (VILLAGERS) భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను సమగ్రంగా గుర్తించి అమలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ జగదేవ్, ఈసీ మధు, పంచాయతీ కార్యదర్శి సుల్తానా, టీఏ చంద్రశేఖర్, ఎఫ్ఏ మండాడి రాము, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు