గోదావరిఖనిలో వీడిని యువతి మృతి మిస్టరీ

20-09-2026 | 01:29pm

పురుగుల మందు తాగించి దారుణ హత్య

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన లెక్చరర్ నవీన్ కుమార్

సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు

మరో నిందితుడు సింగరేణి ఓవర్‌మన్ రవికుమార్ కూడా అదుపులోకి

గోదావరిఖని లో విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి

గోదావరిఖని, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): గోదావరిఖని వన్ టౌన్(Godavarikhani One Town) పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ, ఈర్ష్యతో పథకం ప్రకారం యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్‌తో పాటు మరో నిందితుడు సింగరేణి ఓవర్‌మన్ బొమ్మకంటి రవికుమార్‌ను పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆదివారం గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రామగుండం సీపీ ఆదేశాలతో  పర్యవేక్షణలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చేదించామని అన్నారు. 

అసలేం జరిగింది

డీసీపీ తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం... సుల్తానాబాద్ మండలం గారెపల్లి గ్రామానికి చెందిన జెట్టి నవీన్ కుమార్ (38) సీసీసీ నస్పూర్‌లోని సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబ కలహాల వల్ల దూరంగా ఉంటున్నాడు. 2022లో అదే కళాశాలలో చదువుతున్న సదరు యువతితో నవీన్ కుమార్‌కు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆమెను వివాహం చేసుకోవాలని నవీన్ భావించాడు.

యువతి డిప్లొమా పూర్తయ్యాక హైదరాబాద్ ఓయూలో బీటెక్ మైనింగ్ చేస్తూ, శిక్షణ నిమిత్తం గోదావరిఖని వచ్చిన సమయంలో బెల్లంపల్లికి చెందిన సింగరేణి ఓవర్‌మన్ బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె నవీన్ కుమార్‌కు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. ఇది భరించలేని నవీన్ కుమార్, ఆమెపై తీవ్ర ఈర్ష్య, కక్ష పెంచుకుని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

కారులోనే బలవంతంగా విషం తాగించి

ముందస్తు ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 12న నవీన్ కుమార్ తన స్నేహితుడి వద్ద పురుగుల మందు తెచ్చి, వాటర్ బాటిల్‌లో నింపుకుని తన ఎకోస్పోర్ట్ కారులో పెట్టుకున్నాడు. సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో వస్తున్న యువతిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద తన కారులోకి ఎక్కించుకున్నాడు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఎల్, ఐఓసీ ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెతో గొడవపడ్డాడు.

రవికుమార్ తనపై అఘాయిత్యానికి పాల్పడటం వల్లే చనిపోతున్నట్లు ఆమెతో బలవంతంగా సూసైడ్ నోట్ రాయించి, మొబైల్‌లో ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం తీవ్ర ఆగ్రహంతో ముందే సిద్ధం చేసుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. విష ప్రభావంతో స్పృహ కోల్పోయిన యువతిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా కారులోనే తిప్పుతూ జాప్యం చేశాడు.

ఆత్మహత్యగా నమ్మించే నాటకం

యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లాక, ఆమె ఫోన్ నుంచే తండ్రికి కాల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంటోందని నమ్మించే ప్రయత్నం చేశాడు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో యువతిని ఆమె ఇంటికి తీసుకెళ్లి, తల్లిదండ్రులను సైతం కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చాడు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ యువతి మరుసటి రోజు మృతి చెందింది.నేరం బయటపడకుండా ఉండేందుకు నవీన్ కుమార్ కారును శుభ్రం చేసి, సూసైడ్ నోట్, విషం బాటిల్, మొబైల్ సిమ్ కార్డులను ధ్వంసం చేసి హైదరాబాద్‌కు పారిపోయాడు.

సాంకేతిక ఆధారాలతో అరెస్ట్

కేసు నమోదు చేసుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. నిందితుడు నవీన్ కుమార్‌ను గోదావరిఖని బ్రిడ్జి సమీపంలో, రవికుమార్‌ను ఓసీపీ-5 మైన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి క్రైమ్‌కు ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ట్యాబ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.శిక్షణ సమయంలో రవికుమార్ యువతిపై పాల్పడిన ఆరోపణలు, బాధితురాలు గతంలో సింగరేణి యాజమాన్యానికి ఇచ్చిన దరఖాస్తుపై అధికారుల స్పందన తదితర కోణాల్లోనూ లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు