ముత్తారంలో మెయిన్ రోడ్డు విస్తరణపై వివాదం

25-11-2026 | 06:27pm

పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయం.. పేదల ఇళ్లకు మరో న్యాయమా?

కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద వార్డు సభ్యుల ధర్నా.. పోలీస్ ల హామీతో ఆందోళన విరమణ

ముత్తారం, నవంబర్ 25 (విజయక్రాంతి): ముత్తారం(Muttharam) మండల కేంద్రంలో చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణ పనులపై వివాదం చెలరేగింది. రోడ్డు విస్తరణలో సమాన కొలతలు పాటించకుండా, రాజకీయ పలుకుబడి ఉన్నవారి భవనాలకు మినహాయింపులు ఇస్తూ పేదల ఇళ్లను మాత్రమే తొలగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మల్యాల లక్ష్మి దేవేందర్, ఐద రమేష్ బుధవారం కాసర్లగడ్డ ప్రధాన బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. రోడ్డు విస్తరణలో ఇరువైపులా సమానంగా కొలతలు తీసుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా పనులు జరుగుతున్నాయని వార్డు సభ్యులు ఆరోపించారు.

పలుకుబడి ఉన్నవారి భవనాలకు నష్టం కలగకుండా చూస్తూ, సామాన్యులు, పేదల ఇళ్ల గోడలు, రేకుల షెడ్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రహదారి మధ్యరేఖ, అధికారిక వెడల్పు వివరాలను బహిర్గతం చేయాలని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రణాళిక ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డు సభ్యుల ధర్నాతో బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులతో చర్చించారు. రోడ్డు కొలతలపై ఉన్న అభ్యంతరాలను కాంట్రాక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని  పోలీసులు హామీ ఇవ్వడంతో వార్డు సభ్యులు ధర్నాను విరమించారు.

మరిన్ని వార్తలు