ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా
జైపూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Insurance Scheme) ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి ఆర్థిక భరోసా (Financial Security) కల్పించనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామపంచాయతీలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీడీవో శ్రీపతి బాపుతో కలిసి బీమా నమోదు (Registration) ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి జీవిత భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలోని 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన సభ్యులకు రూ.5 లక్షల జీవిత బీమా (Life Insurance) సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో నామినీల వివరాలు, వారికి కేటాయించాల్సిన వాటాలను నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదు సమయంలో వివరాలను పరిశీలించి కుటుంబ సభ్యుల ఆమోదం పొందిన అనంతరం ఆన్లైన్లో సమర్పిస్తారని, వెంటనే మొబైల్‌కు సందేశంతో పాటు లింక్ వస్తుందని వివరించారు.
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు, కొత్తగా ఆసరా పెన్షన్ల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామని, విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
గంగిపల్లి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. గ్రామానికి 118 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే 85 ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పాఠశాల అభివృద్ధికి రూ.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గత సంవత్సరం రూ.15 లక్షలు, ప్రస్తుత సంవత్సరం మరో రూ.15 లక్షలు సీఎస్ఆర్ నిధులు మంజూరయ్యాయని వివరించారు. గంగిపల్లి నుంచి ఎల్కంటి వరకు రూ.1.57 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ రహదారిని ప్రారంభించినట్లు తెలిపారు. గంగిపల్లి నుంచి గోదావరి సమీపంలోని శ్మశానవాటిక వరకు రహదారి నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్‌లో గ్రామానికి చెందిన ఐదుగురికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో 1,250 మెగావాట్ల నూతన విద్యుత్ ప్లాంట్ ప్రారంభమైనప్పుడు భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. గంగిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సాచురేషన్ ప్రాతిపదికన మంజూరు చేసినట్లు తెలిపారు. జైపూర్ మండలంలోని ఇతర గ్రామాలతో పోలిస్తే ఇక్కడ అత్యధికంగా ఇండ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించామని, తగినన్ని మరుగుదొడ్ల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అంగన్వాడీ కేంద్రంలో అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు బీమా, ఇతర వృత్తులకు సంబంధించిన బీమా పథకాలు అందరికీ వర్తించని నేపథ్యంలో ఈ సార్వత్రిక జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. నమోదు సమయంలో కుటుంబ సభ్యులు, నామినీల వివరాలు, వాటాల కేటాయింపులను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. సమర్పించే ముందు ప్రివ్యూలో వివరాలను సరిచూసుకోవాలని, అనంతరం మొబైల్‌కు వచ్చే సందేశం, లింక్‌ను పరిశీలించాలని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా కొత్తగా 10,360 పెన్షన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీమా, పెన్షన్లు, ఆహార భద్రత పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులు ఎవరైనా పథకాల ప్రయోజనాలు పొందకుండా మిగిలిపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.