తుమ్మిడిహట్టిని విస్మరించి మూడు బ్యారేజీలు కట్టినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు

27-10-2026 | 10:01pm

రీడిజైనింగ్ పేరుతో వేల కోట్లు వృథా.. భూములు, ఇళ్లు కోల్పోయిన ప్రజలు

రాష్ట్ర ప్రజలకు సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

నవంబర్ 1న మంథనికి గణపతి సచ్చిదానంద స్వామీజీ రాక..

ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి శ్రీధర్ బాబు

మంథని, అక్టోబర్ 27 (విజయక్రాంతి): గత ప్రభుత్వం సహజసిద్ధమైన, అత్యంత అనుకూలమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ ప్రాజెక్టును పక్కనపెట్టి, రీడిజైనింగ్ పేరుతో మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు నిర్మించినా మంథని ప్రాంతానికి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేకపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో మంగళవారం పర్యటించిన మంత్రి, పలు అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మిడిహట్టిని కాదని మూడు బ్యారేజీలు నిర్మించి ఏం సాధించారని ప్రశ్నించారు. గత పాలకుల నిర్లక్ష్యం, లోపభూయిష్టమైన ప్రణాళికల వల్ల సాగునీటి రంగం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.

భూములు కోల్పోయినా దక్కని ఫలితం

తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పక్కనబెట్టి రీడిజైనింగ్ పేరుతో నిర్మించిన మూడు బ్యారేజీల వల్ల ఆయా ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు భూములు, ఇళ్లు, జీవనోపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క ఎకరాకూ పారని నీరు

ఇంత పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టినా, ఇప్పటివరకు ఆ బ్యారేజీల ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందిన దాఖలాలు లేవని, ఈ వాస్తవానికి స్థానిక రైతాంగమే ప్రత్యక్ష సాక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది 

ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల కార్యాచరణను అడ్డుకోవాలని కొందరు కుట్రలు పన్నుతున్నప్పటికీ, రైతులకు సాగునీరు అందించి తీరాలన్న పట్టుదలతో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని తేల్చిచెప్పారు.

నవంబర్ 1న మంథనికి గణపతి సచ్చిదానంద స్వామీజీ రాక

అవధూత దత్త పీఠాధిపతి బ్రహ్మశ్రీ గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ నవంబర్ 1న మంథని పట్టణానికి విచ్చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అయ్యగారి చెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌తో పాటు ఇతర భద్రతా ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంథని ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామీజీని ప్రార్థించనున్నట్లు తెలిపారు. నవంబర్ 1న మధ్యాహ్నం స్థానిక దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం, శివకిరణ్ గార్డెన్స్‌లో భక్తులకు ప్రవచనాలు, ఆశీర్వచనాలు ఉంటాయని, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు