ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమురం భీమ్

22-10-2026 | 09:34pm

మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ వెంకన్న

మంథని, అక్టోబర్ 22 (విజయ క్రాంతి) ఆదివాసీల హక్కులు(Rights of Indigenous People), స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు కొమురం భీమ్ అని మంథని ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న  కొనియాడారు. కొమురం భీమ్ జయంతిని పురస్కరించుకుని గురువారం మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రామదేవి, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, మాజీ ఎంపీపీ కొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నిజాం పాలనలో ఆదివాసీలు ఎదుర్కొన్న అన్యాయాలు, అణచివేతకు వ్యతిరేకంగా కొమురం భీమ్ ధైర్యంగా పోరాడారని తెలిపారు. అడవులపై ఆదివాసీల హక్కుల పరిరక్షణ, వారి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.

ఆదివాసీలు అడవుల్లో పశువులను మేపినందుకు కూడా పన్నులు విధించిన నిరంకుశ విధానాలను ఆయన వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నిజాం పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా పోరాటం సాగించి, ఆదివాసీలలో హక్కుల పట్ల చైతన్యం నింపారని అన్నారు. కొమురం భీమ్ త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు