గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో రైతుపై చేయి చేసుకున్న ఎస్సై

23-10-2026 | 11:06pm

ఫిర్యాదు చేసేందుకు వస్తే దాడి చేశారంటూ బాధితుడి బంధువుల ఆరోపణ

ఘటనపై విచారణ చేపట్టిన ఏసీపీ నర్సింలు

గజ్వేల్, అక్టోబర్ 23: సిద్దిపేట జిల్లా(Siddipet District) గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో రైతుపై ఎస్సై మల్లారెడ్డి(SI Mallareddy) చేయి చేసుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. బోరు మోటారు నీటి విషయంలో బంధువులతో తలెత్తిన వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతుపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి జరిగిందని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. గిరిపల్లి గ్రామానికి చెందిన భీమరి రవికి వ్యవసాయ పొలం వద్ద ఉన్న బోరు మోటారు నీటి విషయంలో బంధువులతో వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో బంధువులు దాడి చేయడంతో రవికి స్వల్ప గాయాలయ్యాయని, స్థానికులు అతడిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు రవి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై ఆమర్యాదగా మాట్లాడుతూ రవి చెంపపై కొట్టడంతో కనుబొమ్మ ప్రాంతంలో గాయమై రక్తస్రావం జరిగిందని అతడి బంధువులు ఆరోపించారు.

విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ నర్సింలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. రవికి, ఎస్సైకి మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో ఎస్సై చెంపపై కొట్టడంతో రవి కనుబొమ్మకు గాయమై రక్తస్రావం జరిగినట్లు ఏసీపీ వెల్లడించారు. గాయపడిన రవిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ నర్సింలు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు