భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

23-10-2026 | 10:21pm

రూ. 20 వేల జరిమానా విధించిన రాజేంద్రనగర్ కోర్టు

గండిపేట వీకర్ సెక్షన్ కాలనీలో 2018లో జరిగిన ఘటన

రాజేంద్ర నగర్ అక్టోబర్ 23 (విజయ క్రాంతి) : భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో భర్తకు కోర్టు జీవిత ఖైదు(Life imprisonment) విధిస్తూ తీర్పునిచ్చింది. నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi Police Station) పరిధిలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) గండిపేట గ్రామం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన మహమ్మద్ గౌస్ పాషా(Mohammed Ghouse Pasha) (43) హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. 2018లో ఇతడు తన భార్య షహీన్ బేగం (27)ను హత్య చేశాడు. దీనిపై నార్సింగి పోలీసులు 2018లో క్రైమ్ నంబర్ 330/2018 కింద ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసు విచారణ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పదవ అదనపు జిల్లా(Tenth Additional District) మరియు సెషన్స్ న్యాయస్థానంలో జరిగింది. దర్యాప్తు అధికారులు సేకరించిన పక్కా ఆధారాలు, కోర్టు కానిస్టేబుళ్లు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన సమన్వయంతో కోర్టులో నేరం నిరూపితమైంది. దీంతో నిందితుడు మహమ్మద్ గౌస్ పాషాకు జీవిత ఖైదుతో పాటు రూ. 20,వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ఈ కేసులో అప్పటి మొదటి దర్యాప్తు అధికారి కె. నవీన్ కుమార్, ప్రస్తుత దర్యాప్తు అధికారి జి.వి. రమణ గౌడ్, నార్సింగి సీఐ డి. విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని పోలీస్ బృందం పకడ్బందీగా ఆధారాలను కోర్టు ముందుంచారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. కృష్ణమూర్తి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సృజన రెడ్డి వాదనలు వినిపించగా, లైజన్ అధికారిగా ఏఎస్ఐ జి. శివారెడ్డి సహకారం అందించారు. నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని సైబరాబాద్ ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు