ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మంథని, అక్టోబర్ 1 (విజయ క్రాంతి) మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ, ఎన్‌ఎస్‌ఎస్, చరిత్ర, రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను(Gandhi Jayanti celebrations) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సీహెచ్. పరిషయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గాల్లో శాంతియుత పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మా గాంధీ కృషి ఎనలేనిదన్నారు. గాంధేయ మార్గంలో యువత, విద్యార్థులు, ప్రజలు నడిచి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ మాట్లాడుతూ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించిన గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. చంపారన్ ఉద్యమం, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశారని వివరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కార్నాటి కృష్ణ, అమర్‌నాథ్, ముకుందం, ఫర్జానా, రామకృష్ణ, రజిత, దుర్గం కృష్ణ, శేఖర్, సందీప్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.