పెద్దపల్లి కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

20-09-2026 | 03:13pm

లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

పెద్దపల్లి సెప్టెంబర్20(విజయ క్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని(Peddapalli town) కమాన్ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం(road accident ) చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కూనారం చౌరస్తాలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్న ఆనంద్ అనే యువకుడు స్కూటీపై వెళ్తుండగా, పెద్దపల్లి కమాన్ వద్దకు చేరుకోగానే అతివేగంతో దూసుకొచ్చిన లారీ అతడి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రతకు స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. వాహనంపై ఉన్న ఆనంద్ రోడ్డుపై పడి తీవ్ర రక్తస్రావం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, లారీ డ్రైవర్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు