పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు
బోధన్, అక్టోబర్ 06 (విజయ క్రాంతి): బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో(Bodhan Government Hospital) రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది భద్రతతో పాటు ఆసుపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తుండటంతో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ఈ ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు బోధన్ పట్టణ సీఐ ఎన్.హెచ్. వెంకట నారాయణ తెలిపారు.
ఆసుపత్రిలో పోస్టుమార్టం, మెడికో-లీగల్ కేసులు (ఎమ్మెల్సీ), సంబంధిత ధ్రువపత్రాల నమోదు వంటి సున్నితమైన వ్యవహారాలు కొనసాగుతుంటాయి. ఈ క్రమంలో పోలీసుల పర్యవేక్షణ అందుబాటులో ఉండటం వల్ల వైద్య సిబ్బందికి, రోగులకు, ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
పోలీస్ ఔట్‌పోస్ట్‌లో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని, ఆసుపత్రిలో ఏదైనా సమస్య తలెత్తినా, గొడవలు లేదా ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట నారాయణ తెలిపారు. ముఖ్యంగా పోస్టుమార్టం, ఎమ్మెల్సీ కేసుల సమయంలో అవసరమైన పోలీసు సమన్వయం, బందోబస్తు చర్యలను ఔట్‌పోస్ట్ సిబ్బంది పర్యవేక్షిస్తారని చెప్పారు.
ఆసుపత్రికి వచ్చే ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించవద్దని సీఐ సూచించారు. పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయడంతో ఆసుపత్రిలో భద్రత మరింత మెరుగుపడుతుందని వైద్య సిబ్బంది, రోగుల బంధువులు అభిప్రాయం వ్యక్తం చేశారు.