ఎడారి దేశంలో బతుకమ్మ సంబరం
నిజామాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి. ఈ వేడుకలకు తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తను సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలకు వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ మహిళలు, సోదర సోదరీమణులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంప్రదాయ పాటలతో పాటు “జై తెలంగాణ.. జై కేసీఆర్.. కారు రావాలి.. సారు రావాలి మళ్లీ” అంటూ నినాదాలు, పాటలతో వేడుకల ప్రాంగణం మార్మోగింది. దుబాయ్‌లో జరుగుతున్న సంబరాలను చూస్తుంటే తెలంగాణలోనే ఉన్నామా అన్న అనుభూతి కలిగిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
విదేశీ గడ్డపై ఉంటూ కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటిని పరిచయం చేస్తున్న ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులను బిగాల గణేశ్ గుప్త అభినందించారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ ఆడపడుచులు, సోదర సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, షకీల్, ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ బిగాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.