నా కొడుకు బతికున్నాడా.. లేడా?

12-10-2026 | 03:40pm

బాన్సువాడ, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఉపాధి కోసం రష్యాకు వెళ్లి అక్కడి సైన్యంలో చేరాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకుల వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీరిలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామానికి చెందిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్ (43) మృతి చెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపుతోంది. అయితే ఆయన మృతిపై భారత రాయబార కార్యాలయం (Indian Embassy) నుంచి అధికారిక ధ్రువీకరణ అందకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వాయిస్ మెసేజ్‌తో కలకలం

ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఉపాధి కోసం అఫ్జల్ ఖాన్‌తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు యువకులు రష్యాకు వెళ్లారు. వీరిలో బాధితుడైన సిర్షు అశోక్ రష్యాలోని అడవుల నుంచి తన భార్యకు పంపిన వాయిస్ మెసేజ్‌లో అఫ్జల్ ఖాన్ మృతి చెందినట్లు తెలిపినట్లు సమాచారం. ‘‘అఫ్జల్ ఖాన్ చనిపోయి వారం రోజులైంది. యుద్ధంలో చనిపోయాడు. నేను కూడా అడవుల్లో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాను’’ అని అశోక్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

ఈ సమాచారం బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకుల్లో ఇద్దరు మొదటి విడతగా 50 మంది సైనికుల బృందంతో వెళ్లగా, మరో ఇద్దరు వేరే బృందంతో వెళ్లినట్లు తెలుస్తోంది.

బాధిత కుటుంబంలో ఆందోళన

అఫ్జల్ ఖాన్ మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై స్పష్టత కోసం ఆయన తండ్రి అబ్బాస్ ఖాన్, భార్య, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్ ద్వారా సహాయం కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సిర్షు అశోక్ పంపిన వాయిస్ మెసేజ్ మాత్రమే తమకు అందుబాటులో ఉన్న సమాచారమని పేర్కొంటున్నారు. భారత రాయబార కార్యాలయం లేదా రష్యా ప్రభుత్వం నుంచి అఫ్జల్ ఖాన్ పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

‘నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడా? లేదా?’

తన కుమారుడు ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియక అబ్బాస్ ఖాన్ పడుతున్న వేదన స్థానికులను కలచివేస్తోంది. తన కుమారుడు బతికి ఉంటే వెంటనే స్వదేశానికి తీసుకురావాలని, ఏదైనా దుర్ఘటన జరిగి ఉంటే అధికారికంగా ధ్రువీకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అఫ్జల్ ఖాన్‌కు భార్య జమీల బేగం, ఫర్దీన్ ఖాన్ అనే కుమారుడు తొమ్మిదో తరగతి, అర్ఫియా తహనీన్ అనే కుమార్తె నాలుగో తరగతి చదువుతున్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి పరిస్థితి తెలియకపోవడంతో భార్యాపిల్లలు ఆందోళనలో ఉన్నారు.


మరిన్ని వార్తలు