సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
నిర్మల్,(విజయక్రాంతి): గణేష్ ఉత్సవాల సందర్భంగా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. WhatsApp, Facebook, Instagram, X, YouTube తదితర సోషల్ మీడియా వేదికలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, ఇతర మతాల మనోభావాలను కించపరిచేలా, ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎలాంటి పోస్టులు, వీడియోలు, మెసేజ్లు లేదా కామెంట్లు చేసినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఇతరులు పంపిన రెచ్చగొట్టే లేదా అభ్యంతరకరమైన మెసేజ్లు, వీడియోలను ఫార్వర్డ్ చేయడం కూడా చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని తెలిపారు. నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మకుండా, ఫార్వర్డ్ చేయకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు, యువత పోలీసులకు సహకరించాలని డీఎస్పీ శ్రీనివాస్ కోరారు.