రోడ్లపై ఉన్న పశువుల పట్టివేత
నిర్మల్ అక్టోబర్ 28 ( విజయక్రాంతి):నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులపై ఉన్న పశువులను పట్టుకున్నట్టు మున్సిపల్ కమిషనర్ రవిబాబు(Municipal Commissioner Ravibabu) తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై సంచరిస్తున్న పశువులను గుర్తించి, వాటి యజమానులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..
రోడ్లపై పశువుల సంచారంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పశువుల యజమానులు వాటిని రోడ్లపై వదలకుండా తమ సొంత స్థలాల్లో ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోడ్లపై సంచరించే పశువులన్నింటినీ గోశాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.