ఘట్ కేసర్ బస్సు టర్మినల్ వద్ద ఆటోల ఆగడాలు

10-09-2026 | 04:25am
  1. బస్సు టర్మినల్ ముందే ఆటోల తిష్ట
  2. బస్సులో రాకపోకలకు ఇబ్బందులు
  3. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు

ఘట్ కేసర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఘట్కేసర్(Ghatkesar) బస్ టెర్మినల్ సమీపంలో ఆటోల ఆగడాలతో ప్రయాణికులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. బస్ టెర్మినల్ ప్రధాన ద్వారం ముందే ఆటోలను వరుసగా నిలిపివేయడం (తిష్ట వేయడం) వల్ల నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఆర్టీసీ బస్సులు టెర్మినల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి ఆటోలు అడ్డంగా ఉండటంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ టర్మినల్ సమీపంలో ఆటోలను నిలుపరాదని ఆటో డ్రైవర్లకు అనేక సార్లు చెప్పినా పెడచెవిన పెడు తున్నారని ఆర్టీసీ కంట్రోలర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రయాణికుల భద్రత

ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆటో డ్రైవర్లు పోటీపడి బస్సుల ముందే ఆటోలను నిలపడం వల్ల కాలినడకన వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల భారిన పడే అవకా శం ఉందని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటోల వల్ల జాతీయ రహదారిపై, టెర్మినల్ పరిసరాల్లో వాహనాల నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోందని కా వున ఆటోలను రోడ్లపై నిల్పకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఆటో డ్రైవర్లు

ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. చార్జీల వసూళ్ల విషయమై అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.

ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ కరువు 

బస్ టెర్మినల్ వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ లేనందున ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రాంగ్ సైడ్ లో నడపడమే గాక అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులను ని యామకం చేసి, రాంగ్ పార్కింగ్ చేసే ఆటోలపై చలాన్లు విధించి ఆటో డ్రైవర్ ఆగడాల ను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

ప్రత్యేక ఆటో స్టాండ్ కేటాయించాలి

బస్ టెర్మినల్ ప్రధాన ద్వారానికి దూరంగా ఆటోల నిలుపుదలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించి అక్కడే ఆటోలు నిలిపేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్డు మీద కూడా ఆటోలను ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ప్రయాణికులు కనిపించగానే అక్కడే సడన్ బ్రేక్ వేస్తున్నారు. దీంతో వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రయాణికులకు ఆటంకం కలిగించే ఆటోలపై కఠిన చర్యలు తీసుకునేలా ఆర్టీసీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

బ్లాస్టింగుల మోత.. ధ్వంసమైన రోడ్లు!

అదుపు తప్పితే ప్రమాదమే!

మరిన్ని వార్తలు