వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
ప్రజాప్రతినిధులపై నియోజకవర్గ ప్రజల ఆవేదన
బెజ్జంకి, సెప్టెంబర్ 10: మనకొండూరు నియోజకవర్గంలో (Manakondur Constituency) ప్రజలు ప్రజాప్రతినిధుల వైపు ఆశగా చూస్తున్నారు. తమ ప్రాంత సమస్యలకు పరిష్కారం చూపించి, అభివృద్ధికి బాటలు వేయాల్సిన నాయకులు రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలకే పరిమితమవుతున్నారంటూ పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఎవరు ఎవరిపై విమర్శలు చేసుకుంటున్నారనే విషయం కాదని, తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపడం,
మౌలిక వసతులు కల్పించడం, రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం వంటి అంశాలపై దృష్టి పెట్టడమేనని ప్రజలు పేర్కొంటున్నారు. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులంతా కలిసి పనిచేయాలని కోరుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి ప్రజల సమస్యలను అసెంబ్లీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మాకు రాజకీయ విమర్శలు కాదు..
అభివృద్ధి కావాలి. నాయకుల మధ్య మాటల యుద్ధం కంటే మా సమస్యలపై పోరాటం చేయాలి అని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారిస్తారా? వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
నాయకులు ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యతను గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మా నియోజకవర్గానికి ఏం కావాలి, ఏ సమస్యలు ఉన్నాయి,
వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలి. మమ్మల్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన నాయకులే ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం బాధాకరం. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలు, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం.
బెజ్జంకి స్థానికుడు
ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. మేము నాయకుల నుంచి ఆశించేది వ్యక్తిగత విమర్శలు, దూషణలు కాదు.. మా ప్రాంత అభివృద్ధి. నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది.
వాటిపై మాట్లాడి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలి. నాయకులు ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడదు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను.
రూపేష్, సిపిఐ మండల కార్యదర్శి
మనకొండూరు నియోజకవర్గ ప్రజలు ప్రజాప్రతినిధులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం వ్యక్తిగత విమ ర్శలు, దూషణలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను.
నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కానీ, ఇలా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులకు బాటలు వేయడంపైనే ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి.
రెడ్డి, బీజేపీ నాయకులు