సింధ్ దేశం కావాలి
- పాకిస్థాన్‌లో స్వతంత్ర దేశం కోసం ఉద్యమం
- రాష్ట్రాల విభజనకు సింధీయుల వ్యతిరేకం
కరాచీ, నవంబర్ 24: పాకిస్థాన్‌లో(Pakistan) మరో విభజన ఉద్యమం ఊపందుకుంది. సింధ్ ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలంటూ అక్కడి ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరత, ఉగ్రవాద దాడులు, సైనిక వ్యవస్థ(Military System) జోక్యంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో ప్రాంతీయ విభజన వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. సింధ్ రాష్ట్రాన్ని (ప్రావిన్స్) విభజించి కొత్త పరిపాలనా విభాగాలు ఏర్పాటు చేయాలన్న ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్(Asim Munir) ప్రతిపాదనపై సింధీ జాతీయవాదులు(Sindhi nationalists) తీవ్రంగా మండిపడుతున్నారు.
‘సింధ్ పాకిస్థాన్ వద్దు.. సింధ్ దేశం కావాలి’ అని నినదిస్తున్నారు. సింధ్ రాష్ట్ర విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా నాలుగు సింధీ జాతీయవాద పార్టీలతో కూడిన జై సింధ్ రహబర్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది కరాచీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక స్వతంత్ర దేశం కోసం అవసరమైతే అత్యంత శక్తివంతమైన రాష్ట్రంగా భావించే పంజాబ్‌పై ఆర్థిక దిగ్బంధనం విధిస్తామని వేర్పాటువాద సంస్థలు ప్రకటించాయి. ఈ పరిణామాలు అసీమ్ మునీర్‌కు కొత్త రాజకీయ సవాల్‌గా మారాయి.
పాక్‌లో 12-15 చిన్న రాష్ట్రాలకు ప్లాన్
పాకిస్థాన్‌లో ప్రస్తుతం పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్థాన్ అనే నాలుగు రాష్ట్రాలు (ప్రావిన్స్‌లు) ఉన్నాయి. అయితే.. పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు 12 నుంచి 15 చిన్న రాష్ట్రాలు, పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ మంత్రి మొహిసిన్ నఖ్వీ ప్రతిపాదించారు. సింధ్‌ను బలహీనపరిచేందుకే, కరాచీ నుంచి సింధ్‌ను వేరు చేసేందుకే రాష్ట్రాలను విభజిస్తున్నారంటూ సింధీయులు ఆందోళన చేస్తున్నారు. సింధ్‌ను ముక్కలు చేస్తే సహించేది లేదని, ప్రజలు తిరగబడతారని, కరాచీ, హైదరాబాద్ వీధుల్లో రక్తపాతం జరుగుతుందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ పాక్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
విభజన ప్రతిపాదనను జమాయత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టింది. సింధీ జాతీయవాదులు అయితే ఏకంగా సింధు ప్రత్యేక దేశం డిమాండ్‌తో కొత్త ఉద్యమం ప్రారంభించారు. పంజాబ్ ఆధిపత్యంలోని పాలక వర్గం సింధ్ సహజ వనరులను దోచుకుంటోందని సింధీ జాతీయవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నెల 29వ తేదీన కరాచీలో భారీ పాదయాత్రకు సింధీ జాతీయవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి.