గ్లోబల్ సమ్మిట్‌కు చకచకా ఏర్పాట్లు
- రాష్ట్ర పారిశ్రామిక శక్తిని, ప్రతిభను ప్రపంచానికి చాటుతాం
- అందుకు అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు
- ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు పెద్దపీట
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతినిధులకు ఆతిథ్యం
- డిసెంబరు 7 నుంచి 9 వరకు సదస్సు
- బేగరికంచె యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వేదిక
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలన
రంగారెడ్డిబ్యూరో/కందుకూరు, నవంబర్ 24 (విజయక్రాంతి): అంతర్జాతీయ పెట్టుబడిదారులను(International investors) ఆకర్షించి, తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు సర్వం సిద్ధమవుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) వెల్లడించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బేగరికంచె (భారత్ ఫ్యూచర్ సిటీ)(India Future City)లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనున్న ఈ మెగా సదస్సు ఏర్పాట్లను మంగళవారం క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు.
పనుల పురోగతిపై ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్‌పో జోన్లు, రాష్ట్రంలో ఉన్న సమగ్ర పారిశ్రామిక వాతావరణం (కాంప్రహెన్సివ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్), నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సులభతర వాణిజ్య విధానాలను (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు కళ్లకు కట్టినట్లు చూపాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
ముఖ్యంగా రాష్ట్రం అత్యంత బలంగా ఉన్న ఐటీ, లైఫ్ సైన్సెస్ (ఫార్మా), ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోని అవకాశాలను వివరిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్‌పో జోన్లను తీర్చిదిద్దాలని ఆదేశించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేస్తున్న అడుగులను, భవిష్యత్తు ప్రణాళికలను పెట్టుబడిదారులకు స్పష్టంగా వివరించాలన్నారు.
తెలంగాణ సంస్కృతిలో ఆతిథ్యం
గతంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుల స్ఫూర్తితో, అంతకుమించిన రీతిలో ఈ సమ్మిట్ విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. సదస్సుకు వివిధ దేశాల పారిశ్రామిక దిగ్గజాలు, విధాన నిర్ణేతలు తరలిరానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్,విద్యుత్, హైస్పీడ్ ఇంటర్నెట్, వైద్య సేవల విషయంలో ఏమాత్రం లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. విమానాశ్రయం నుంచి వేదిక వరకు సులభతర రవాణా, కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా, విదేశీ అతిథులకు తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయ వంటకాల రుచి చూపిస్తూ ఆత్మీయ ఆతిథ్యం అందించాలని సూచించారు.
నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి
సదస్సుకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్నందున, పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివస్తాయని, తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి... ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఇందుకు గ్లోబల్ సమ్మిట్‌ను ఒక కీలక వేదికగా వినియోగించుకోవాలని ప్రభు త్వం భావిస్తోందన్నారు. అందుకు అనుగుణంగా సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు.