ఫూలే దంపతులకు తెరపై నివాళి

25-11-2026 | 05:05am

సామాజిక సంస్కరణల చరిత్రలో(History of Social Reforms) చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే(Mahatma Jyotirao Phule, Savitribai Phule). వారు సాగించిన పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘ఫూలే(Phule)’. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ పతాకంపై డా. పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఇందులో ప్రతీక్ గాంధీ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలే పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో నవంబర్ 27న ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర  యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త విమలక్క, టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, రచయిత పసునూరి రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. “నేడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే, సావిత్రిబాయి ఫూలే వేసిన పునాదులు కారణం. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు. సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

చిత్ర నిర్మాత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. “ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నవంబర్ 27న ఎన్ని సినిమాలు విడుదలైనా, ‘ఫూలే’ ఒక విభిన్నమైన జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆదర్శ దంపతులకు ఈసారి వెండితెరపై నివాళి అర్పిద్దాం” అని తెలిపారు. పసునూరి రవీందర్, ప్రతాని రామకృష్ణ గౌడ్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు