ప్రపంచ ధ్యాన దినోత్సవ పాలక కమిటీ వైస్ చైర్మన్‌గా శివకృపానంద స్వామీజీ
న్యూఢిల్లీ: ప్రపంచ ధ్యాన దినోత్సవ పాలక కమిటీ వైస్ చైర్మన్‌గా, దక్షిణాసియా ప్రాంత చైర్‌పర్సన్‌గా హిమాలయన్ సమర్పన్ మెడిటేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ శివకృపానంద స్వామీజీ(Shivkrupanand Swamiji) నియమితులయ్యారు. ప్రపంచ ధ్యాన దినోత్సవ సంఘం(World Meditation Day Association), ప్రపంచ ధ్యాన ఫౌండేషన్ సంయుక్త ఒప్పందం ద్వారా ఈ నియామకాన్ని ప్రకటించాయి. స్వామీజీ నియామకం అంతర్గత చైతన్యానికి, అత్యాధునిక సాంకేతికతకు మధ్య సమన్వయంపై చర్చకు మార్గం సుగమం చేయనుంది.
కృత్రిమ మేధస్సు, అధిక డిజిటల్ అనుసంధానం ఆధిపత్యం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో ధ్యానాన్ని కీలక సాధనంగా నిలపాలని ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఏడాది డిసెంబరు 21న నిర్వహించే ప్రపంచ ధ్యాన దినోత్సవం ద్వారా ధ్యానం, అంతర్గత సమతుల్యత, సామూహిక చైతన్యాన్ని ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
యోగ, ధ్యానం, అంతర్గత వికాస సాధనలకు భారతదేశం చిరకాలంగా కేంద్రంగా నిలుస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో స్వామీజీ నియామకం సమగ్ర ఆరోగ్యం, శాంతియుత సహజీవనం దిశగా ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించడంలో భారతదేశానికున్న గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. ‘‘పుస్తకం ద్వారా గానీ, ఆయుధం ద్వారా గానీ ప్రపంచ శాంతిని సాధించలేం. అంతర్గత శాంతితోనే ప్రపంచ శాంతి ప్రారంభమవుతుంది’’ అని శ్రీశ్రీశ్రీ శివకృపానంద స్వామీజీ పేర్కొన్నారు.
‘‘మానవ అస్తిత్వాన్ని కేవలం భౌతిక శరీరంతోనే గుర్తించడం ప్రపంచంలో విభేదాలకు మూలకారణం. దీనివల్ల మతం, జాతి, జాతీయత ఆధారంగా కృత్రిమ విభజనలు ఏర్పడుతున్నాయి. నిజమైన ధ్యానం అంటే ఆత్మసాక్షాత్కారం కోసం అంతర్ముఖంగా చేసే ప్రయాణం. ఇందులో మన ఆత్మే మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. వ్యక్తిలో అంతర్గత పరివర్తన తీసుకురావడం ద్వారా విశ్వ సోదరభావాన్ని, ప్రపంచ సామరస్యానికి శాశ్వత పునాదిని నిర్మించగలమని ఆయన వివరించారు.
స్వామీజీ హిమాలయాల్లో 18 సంవత్సరాల పాటు కఠోర ఆధ్యాత్మిక సాధన చేశారు. ఈ క్రమంలో సాధువులు, యోగ గురువుల నుంచి ప్రత్యక్ష అనుభవ జ్ఞానాన్ని పొందారు. ఏకాంతంలోనే ఉండిపోకుండా తిరిగి సమాజంలోకి వచ్చి, 1994లో ‘హిమాలయన్ సమర్పన్ మెడిటేషన్ ’ను స్థాపించారు. గత మూడు దశాబ్దాలుగా 72కి పైగా దేశాల్లోని 30 లక్షల మందికి పైగా సాధకులకు ఉచితంగా ధ్యానాన్ని బోధిస్తున్నారు.