ఏపీ వైపు తుపాను దూకుడు..పెను ముప్పు!
ఆంధ్రప్రదేశ్‌కు అతి తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ రాష్ట్ర తీరం వైపు కదులుతోంది. ఈ తుపాను అక్టోబర్ 28న బాపట్ల(Bapatla)–విశాఖపట్నం(Visakhapatnam) మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించినట్లు సమాచారం. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఐఎండీ బులెటిన్ ప్రకారం, వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 880 కిలోమీటర్లు, కాకినాడకు 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. అక్టోబర్ 26న తుపానుగా, 27న తీవ్ర తుపానుగా, 28 నాటికి అతి తీవ్ర తుపానుగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని అంచనా. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ అధికారులు సూచించారు.
తుపాను ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ప్రతినిధులతో పరిస్థితిని సమీక్షించి, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేరవేయాలని స్పష్టం చేశారు.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తుపాను దిశ, తీవ్రతలో మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారిక హెచ్చరికలను పాటించాలని ప్రజలకు సూచించారు.