మున్నూరు కాపులు రాజకీయ శక్తిగా ఎదగాలి
- ఖమ్మం మేయర్ పదవే లక్ష్యం
- మున్నూరు కాపులకు ఆర్ జె సి కృష్ణ పిలుపు
ఖమ్మం, అక్టోబర్ 25(విజయక్రాంతి):- “రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో(Khammam Corporation Election) ఇతర కులాలను కలుపుకొని పోతూ, మేయర్ పదవిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని మున్నూరు కాపులను ఒక గొప్ప రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలి” అని ఆర్ జె సి కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ జే సీ కృష్ణ నివాసంలో అయన అధ్యక్షతన జరిగిన కొండా దేవయ్య కాపు సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో అయన మాట్లాడారు.కొండా దేవయ్య నాయకత్వంలోని మున్నూరు కాపు సంఘాన్ని(Munnuru Kapu Association) అతి త్వరలోనే విస్తృతపరుస్తామని శెట్టి రంగారావు స్పష్టం చేశారు.
మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ మాట్లాడుతూ.. సంఘం అనేది సరైన నిర్మాణంతో సాగాలని, మున్నూరు కాపుల చరిత్ర తెలియని వారి చేతుల్లోకి వెళ్లకుండా, కేవలం వ్యక్తి ఆరాధనలకు లేదా మూడు కుటుంబాల పాలనకు పరిమితమయ్యే సంస్థగా మారకూడదని అన్నారు.గత పదేళ్లపాటు ఈ సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని లక్కినేని సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సంఘం కేవలం ఖమ్మం పట్టణానికే పరిమితం కాకుండా జిల్లావ్యాప్తంగా విస్తరించాలని రాపర్తి శరత్ సూచించగా, సేవా రంగంలోనూ మన సంఘాన్ని ముందు వరుసలో నిలపాలని పొన్నం వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో కనిశెట్టి నరసయ్య, సాగర్, పిన్ని కోటేశ్వరరావు, మాటేటి కిరణ్, లక్కినేని సుధీర్ శ్రీదేవి, పసుపులేటి నాగరాజు, ఎర్ర జ్ఞానేశ్, రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు వరప్రసాద్, నాలం సతీష్, గుండెపునేని రాజా తాళ్ళూరి రవి, మేకల శంకర్ బాబు, ఎండిఓ రవి, ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.