నేపాల్ వరదలు.. 213 మంది భారతీయులు మృతి

26-11-2026 | 04:44pm

నేపాల్‌లో ఈ ఏడాది ఆగస్టు 26న సంభవించిన భారీ వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయులను మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ (Legal Process) ప్రారంభించింది. ఇందులో భాగంగా గల్లంతైన భారతీయుల జాబితాను విడుదల చేసి, వారి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను కోరుతోంది. ఈ నేపథ్యంలో కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) బాధిత కుటుంబాలకు కీలక సూచనలు జారీ చేసింది.

నేపాల్ జాతీయ విపత్తు నష్ట నివారణ, నిర్వహణ అథారిటీ విడుదల చేసిన జాబితాలో 213 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఈ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, పేర్లలో తప్పులు ఉన్నా, మార్పులు చేయాల్సి ఉన్నా లేదా అదనపు వివరాలు చేర్చాల్సి ఉన్నా డిసెంబర్ 2వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది. నిర్ణీత గడువులోగా వివరాలు సమర్పించాలని కోరింది.

అభ్యంతరాల స్వీకరణ (Objections) ప్రక్రియ పూర్తయిన తర్వాత నేపాల్ ప్రభుత్వం తుది జాబితాను ఖరారు చేయనుంది. అనంతరం గల్లంతైన వారిని చట్ట ప్రకారం మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత సంబంధిత స్థానిక అధికారుల ద్వారా మరణ ధ్రువీకరణ పత్రాల (Death Certificates) జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాల నుంచి మరిన్ని వివరాలు, అవసరమైన పత్రాలను కోరే అవకాశం ఉందని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. తదుపరి పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఈ విపత్తులో 1,400 మందికి పైగా మరణించగా, విదేశీయులతో సహా 5 వేల మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు వెల్లడించాయి. భోటెకోశి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో వరదల ప్రభావం తీవ్రంగా కనిపించింది. నదీ తీరాల్లోని పలు మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సుమారు డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం చేపట్టిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చట్టపరమైన ప్రక్రియ ద్వారా మరణ ధ్రువీకరణ చేపట్టాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రక్రియలో భాగంగా 12 దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాల ద్వారా మొత్తం 452 మంది విదేశీయుల వివరాలు నేపాల్ ప్రభుత్వానికి అందాయి. వీరిలో అత్యధికంగా 213 మంది భారతీయులు ఉండగా, 85 మంది చైనీయులు, 69 మంది అమెరికన్లు, 32 మంది బ్రిటిష్ పౌరులు, 27 మంది కెనడియన్లు ఉన్నారు. మిగిలిన వారు ఇతర దేశాలకు చెందినవారు.

గల్లంతైన భారతీయుల కుటుంబాలకు మరణ ధ్రువీకరణ పత్రాలు పొందే ప్రక్రియలో ఈ జాబితా కీలకంగా మారనుంది. కాబట్టి బాధిత కుటుంబ సభ్యులు డిసెంబర్ 2వ తేదీలోగా జాబితాను పరిశీలించి, అవసరమైన అభ్యంతరాలు, సవరణలను భారత రాయబార కార్యాలయానికి తెలియజేయాలని అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు