పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత పరిశుభ్రత వస్తువుల పంపిణీ
కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత. -సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా
కోనరావుపేట, నవంబర్ 26 (విజయక్రాంతి):కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో(Bauusaipeta Village) గ్రామ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులను పంపిణీ చేశారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులను అందజేశారు.
గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేసే పనుల్లో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి ఆరోగ్య రక్షణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఈ వస్తువులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు.గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారు ప్రతిరోజూ ఎంతో కష్టపడుతున్నారని, వారి ఆరోగ్యం, భద్రత పట్ల శ్రద్ధ చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, నక్క ఎల్లయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.