శిలాఫలకంపై సీఎం పేరు ఏదీ? సీఎస్‌కు ఎంపీ లేఖ
హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాల శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించాల్సిందేనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna) స్పష్టం చేశారు. మంథనిలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవన శిలాఫలకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సంబంధిత మంత్రుల పేర్లు లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎంపీ లేఖ రాశారు. శిలాఫలకంపై ముఖ్యమంత్రి పేరు, ఫొటోతో పాటు సంబంధిత శాఖ మంత్రుల పేర్లను కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేర్చాలని కోరారు. జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసం నిర్వహించేవని, వాటిని వ్యక్తిగత ప్రచారానికి వేదికలుగా మార్చకూడదని వంశీకృష్ణ పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవులకు గౌరవం ఇవ్వడం, ప్రభుత్వ ప్రోటోకాల్‌ను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు.వ్యక్తుల కంటే వ్యవస్థలు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తన గళాన్ని ఎల్లప్పుడూ వినిపిస్తానని ఎంపీ స్పష్టం చేశారు.