కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
పటాన్ చెరు, నవంబర్ 27: పటాన్‌చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College) భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. వేంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలను విద్యార్థులు ఆచరణలో పెట్టాలని ప్రిన్సిపాల్ సూచించారు.
చరిత్ర అధ్యాపకులు కె. సైదులు రాజ్యాంగ రూపకల్పన, ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలపై వివరించారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రాజ్యాంగ అవగాహనపై ఏకాంకికలు ప్రదర్శించడంతో పాటు రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.