గణితంలో ‘కాక్డే’కు రామానుజన్
- అవార్డు ప్రకటించిన ఐసీటీపీ, ఐఎంయూ
- బీజ గణిత సిద్ధాంతాలు, సంఖ్య అమరిక, క్లిష్ట సమస్యల పరిష్కారంలో దిట్ట
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రతిష్ఠాత్మకమైన ఆచార్య రామానుజన్ (Acharya Ramanujan) 2026 బహుమతిని బెంగళూరుకు చెందిన గణిత శాస్త్రవేత్త మహేష్ కాక్డేను(Mathematician Mahesh Kakde) వరించింది. సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన కృషికి గానూ ఐసీటీపీ (ఇంటర్నేషనల్ సెంటర్ థియరిటికల్ ఫిజిక్స్), ఐఎంయూ (ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్) సంయుక్తంగా అవార్డును బుధవారం ప్రకటించాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా కాక్డే పనిచేస్తున్నారు. బీజగణిత సిద్ధాంతాలు, సంఖ్యల అమరిక, అనుసంధానానికి సంబంధించిన అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో కాక్డే కీలకంగా నిలిచారు.
ఈయన ‘ఇవాసావా’ సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. గ్రాస్-స్టార్క్ , బ్రూమర్-స్టార్క్ ప్రతిపాదనలకు కూడా కాక్డే తోడ్పాటు అందించాడు. ఇవి సంఖ్యా శాస్త్రంలోని వేర్వేరుగా కనిపించే రంగాలను అనుసంధానించే లెక్కలు. 1900లో జర్మన్ గణిత శాస్త్రవేత్త డేవిడ్ హిల్బర్ట్ ప్రతిపాదించిన 23 ప్రసిద్ధ గణిత సమస్యలలో ఒకటైన హిల్బర్ట్ 12వ సమస్యపై కాక్డే కృషి చేశారు. భారత్‌లో పుట్టి పెరిగిన కాక్డే ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్‌లో బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పూర్తి చేసి, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివారు.
2008లో గణితశాస్త్రంలో తన మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీని పూర్తి చేశారు. అనంతరం ప్రిన్స్‌టన్, లండన్ యూనివర్సిటీ, కింగ్స్ కాలేజీలో పనిచేసి, 2019లో ఐఐఎస్‌సీలో ఫ్రొఫెసర్‌గా చేరారు. 2022లో ఇన్ఫోసిస్ గణిత శాస్త్రంలో బహుమతిని అందజేసింది. 2023లో ‘ఏషియన్ సైంటిస్ట్ 100’ జాబితాలో స్థానం దక్కింది. రామానుజన్ అవార్డుతోపాటు 10వేల డాలర్లు సుమారు రూ. 10 లక్షలు అందుకోనున్నారు.