బెన్సౌల్ నివేదిక తప్పులతడక
- దావూద్‌పై ఐరాస ప్రత్యేక ప్రతినిధి నివేదికపై భారత సెక్రటరీ ఆగ్రహం
- అసమర్థ వ్యాఖ్యలతో యూఎన్వో ప్రతిష్ఠకు భంగం తప్పదు
- వెంటనే నివేదికను సరి చేసుకోవాలి: రఘూపూరి
న్యూయార్క్, అక్టోబర్ 22: గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) ప్రస్తుతం ఎక్కడో లేడని, గతంలో అల్-ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే (పాకిస్థాన్‌లో) ఆశ్రయం పొందుతున్నాడనే విషయాన్ని ఐరాసా వేదికగా మరోసారి భారత్ స్పష్టం చేసింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డి- కంపెనీని ‘భారత దేశానికి చెందిన’ నేర సమూహంగా ఐరాస ప్రత్యేక ప్రతినిధి వర్ణించడాన్ని తీవ్రంగా తిరస్కరించారు.
ఆ నివేదికలో స్పష్టమైన తప్పులు ఉన్నాయని ఎత్తిచూపుతూ, ఇటువంటి అసమర్థత ప్రపంచ సంస్థకు అపారమైన హాని కలిగిస్తుందని హెచ్చరించారు. ఐరాస ప్రత్యేకప్రతినిధి బెన్సౌల్ ఇచ్చిన నివేదిక పూర్తిగా తప్పుల తడకేనని ఐరాసలోని భారత మిషన్ ఫస్ట్ సెక్రటరీ రఘూ పూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికను 2026 జూలైలో బెన్ సౌల్ సిద్ధం చేశారు. దీన్ని అక్టోబర్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ 81వ సదస్సులో ప్రవేశపెట్టారు. బెన్ సౌల్ సమర్పించిన నివేదికను గురువారం రఘూపూరి తీవ్రంగా ఖండించారు.
నివేదికలో దావూద్ డీ కంపెనీ భారత్‌కు చెందిన క్రిమినల్ గ్రూప్ అని పేర్కొనడంపై తీవ్రంగా మండిపడ్డారు. అల్ ఖైదాతో సంబంధాలున్నాయని 2003లో ఐరాస భద్రతా మండ లి అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో దావూద్‌ను చేర్చిందని స్పష్టం చేశారు. 1993 నుంచి ఉగ్రవాదదాడులకు సంబం ధించి భారత్‌లో అతను మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని ప్రకటించకుండా, నివేదికలో భారత్ కు చెందిన క్రిమినల్ గ్రూప్‌గా పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి అసమర్థ వ్యాఖ్యలతో ఐరాస ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని, తీవ్ర నష్టం చేకూరుతుందని మండిపడ్డారు. ఐరాస పేర్కొన్న నివేదికను వెంటనే సరిచేసుకోవాలని రఘూపూరి ఘాటుగా సమాధానం ఇస్తూ బెన్సౌల్కు చురకలంటించారు. నిజాలు లేని నివేదికలు విడుదల చేయడం సభ్య దేశాల్లో చులకనైపోతారని, చట్టబద్ధతపై కూడా సవాళ్లు ఎదురవుతాయని హెచ్చ రించారు. కాగా బెన్సౌల్పై యూఎన్‌కు చెందిన ఓ కథనం ప్రచురితమైందని అందు లో సౌల్ చైనా నుంచి 1.50 లక్షల డాలర్లు అందుకున్నట్లు రఘూపూరి ఆరోపించారు.