స్థానిక ఎన్నికలు : బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన!
ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు.. కేటగిరీల వారీగా పూర్తి వివరాలు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. డెడికేటెడ్ కమిషన్ సర్వే ఆధారంగా వివిధ స్థానాలకు వర్తించే రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలను ప్రకటించారు. స్థానిక సంస్థల్లో పదవుల వారీగా బీసీలకు దక్కే రిజర్వేషన్ల శాతాలను వివరించారు.
ఏ స్థానానికి ఎంత రిజర్వేషన్?
డెడికేటెడ్ కమిషన్ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు వర్తించే రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మేయర్ పదవులు: 35.29 శాతం
అర్బన్ వార్డులు: 32.78 శాతం
మున్సిపల్ చైర్‌పర్సన్‌లు: 33.02 శాతం
గ్రామ పంచాయతీ వార్డులు: 26.73 శాతం
సర్పంచ్ పదవులు: 27.95 శాతం
MPTC స్థానాలు: 25.55 శాతం
MPP పదవులు: 24.60 శాతం
ZPTC స్థానాలు: 24.60 శాతం
జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు: 23.08 శాతం
బీసీలకు అన్యాయం జరగనివ్వం: అచ్చెన్నాయుడు
బీసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా పేర్కొన్నారు.
34 శాతం కోటాపై సుప్రీంకోర్టు నిర్ణయం
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు సమాచారం. ఈ పరిణామంతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు, ఎన్నికల నిర్వహణపై చర్చ కొనసాగుతోంది. డెడికేటెడ్ కమిషన్ సర్వే ఆధారంగా ప్రకటించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.