ముందే ముంచుకొస్తున్న పశుగ్రాసం కొరత
బోథ్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది వివిధ గ్రామాల పరిసరాల్లోని నీటి కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోగా, అక్టోబర్ నెల ప్రారంభం నుంచే వాటిలో నీటిమట్టం తగ్గిపోతోంది (Water Levels). ఫలితంగా రాబోయే రోజుల్లో పశువులకు నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉందని గ్రామీణ ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలమట్టం పెరగలేదు. దీంతో చిన్నచిన్న నీటి కుంటలు సైతం ఇప్పుడే ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు నీటి కుంటలు ఎండిపోతుండటంతో పశువులకు నీటి కొరత తప్పదేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎండల తీవ్రతతో పశుగ్రాసం కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. గతంలో రబీ పంటల సాగు అధికంగా ఉండటంతో పశువులకు అవసరమైన జొన్న, మొక్కజొన్న మేత విరివిగా లభించేది. అయితే ఈ ఏడాది ఆయా పంటల సాగుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పశుగ్రాసం (Fodder) కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులు ముందుచూపుతో వ్యవహరించి పశువులకు అవసరమైన నీరు, మేతను అందుబాటులో ఉంచుకోకపోతే మూగజీవాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.