అధికార పార్టీలో ఉన్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా కొట్లాడాల్సి వస్తోంది
- గట్టుప్పల్ అభివృద్ధికి రెండేళ్లలో ప్రత్యేక కార్యాచరణ
- కురుమ సంఘం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, నవంబర్ 1 (విజయక్రాంతి): అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Rajagopal Reddy) అన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు, ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో అందడం లేదని, అయినప్పటికీ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, గట్టుప్పల్ మండలాన్ని రాబోయే రెండేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో కురుమ సంఘానికి చెందిన శ్రీ బీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం భవన ప్రాంగణంలో మొక్కను నాటి మాట్లాడారు.కురుమ సంఘానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వయోధికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం సామాన్య కార్యకర్తలాగే పనిచేస్తానని, రాజకీయాల్లో ఉన్నంతకాలం అవినీతికి తావివ్వనని పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే వ్యవస్థలో అవినీతి నిర్మూలన అవసరమన్నారు. గ్రామాల్లో పెరుగుతున్న మద్యపాన సంస్కృతి వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్‌షాపుల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల ప్రభావం ప్రస్తుత ప్రభుత్వంపై పడుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు నిధులు అవసరమని, ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొన్ని పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తీసుకొచ్చే విషయంలో గత ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ రూపొందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించి, కేబినెట్లో నిర్ణయం తీసుకున్న అనంతరం ఏదుల నుంచి నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
తన రాజీనామా తర్వాతే గట్టుప్పల్ మండలంగా ఏర్పడిందని, చండూరు రెవెన్యూ డివిజన్‌గా మారిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే వారే రాజకీయాల్లో ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మునుగోడు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలు, నాయకత్వం, పాలనా వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.గట్టుప్పల్ మండలంలో రాబోయే రెండేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మంగళ మండల్ పార్టీ నాయకులు, కురుమ సంఘం నాయకులు ఉన్నారు