బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించరా?

22-10-2026 | 10:08pm

ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయం.. 

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్

దామరచర్ల: తెలంగాణ రాష్ట్రంలో మహనీయుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడం ద్వారా వారి సేవలను స్మరించుకోవడం అభినందనీయమని,అయితే బీసీలకు రాజకీయ అధికారంలో తగిన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ పేర్కొన్నారు. దామరచర్ల లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర జనాభాలో గణనీయమైన వాటా కలిగిన బీసీలకు రాజకీయ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.బీసీలకు కేవలం మహనీయుల విగ్రహాలు, జయంతి ఉత్సవాలకే పరిమితం కాకుండా, పాలనలోనూ నిర్ణయాధికారంలోనూ సముచితమైన భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 50 శాతం బీసీలకు కేటాయించాలి. బీసీల జనాభా దామాషా, సామాజిక న్యాయం ప్రాతిపదికన నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా త్వరలో భర్తీ చేయనున్న గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల్లో ఇద్దరు బీసీ నాయకులకు అవకాశం కల్పించి,బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు