నీటి తరలింపుపై అభ్యంతరం.. ఉత్తమ్‌తో నేతల భేటీ!

22-10-2026 | 05:50pm

హైదరాబాద్: పాలమూరు జిల్లా ఆయకట్టుకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)ని కోరారు. డిండి ప్రాజెక్టు(Dindi project)కు నీటిని తరలించే విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏదుల నుంచి కాకుండా మరో మార్గం చూడండి!

డిండి ప్రాజెక్టుకు నీటిని అందించడంపై తమకు వ్యతిరేకత లేదని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే, ఏదుల నుంచి నీటిని తరలిస్తే పాలమూరు ఆయకట్టు(Palamuru irrigation)కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల డిండి ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని కోరారు.

అధికారులతో చర్చించి నిర్ణయం: ఉత్తమ్

పాలమూరు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై అధికారులతో చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీంతో డిండి ప్రాజెక్టు నీటి తరలింపు మార్గంపై తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు