విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల రాస్తారోకో
భారీగా నిలిచిపోయిన వాహనాలు..
కల్వకుర్తి సెప్టెంబర్ 10: రైతులకు 24 గంటల త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ రైతులు గురువారం రాస్తారోకో(Farmers Rasta roko) నిర్వహించారు. కల్వకుర్తి మండలం తాండ్ర గేట్ వద్ద హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై(Hyderabad–Srisailam Main Road) బైఠాయించి నిరసన తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు సాగు చేసినప్పటికీ, విద్యుత్ కోతల(power cuts) కారణంగా ఉన్న నీటిని కూడా పంటలకు అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని, ఎన్నడూ లేనివిధంగా పెట్టుబడులు పెట్టి ప్రస్తుతం ఆకాశం వైపు చూస్తున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే 24 గంటల త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి(Chief Minister Revanth Reddy) సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుండగా, సమీపంలోని తాండ్ర గ్రామంలో మాత్రం రోజుకు ఎనిమిది గంటలు కూడా విద్యుత్ అందడం లేదని రైతులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా(Power supply) జరిగేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత 12 గంటలకు, ప్రస్తుతం ఎనిమిది గంటలకు కూడా పరిమితమైందని విమర్శించారు.
రైతుల రాస్తారోకోతో హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ప్రభుత్వం విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.