వడ్డేపల్లి బండ్‌కు కొత్త కళ.. పనులకు స్పీడ్ పెంచాలి!

29-10-2026 | 02:05pm

హనుమకొండ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): జిల్లా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు చేపట్టిన వడ్డేపల్లి బండ్ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

గురువారం వడ్డేపల్లి బండ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్నతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో భాగంగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ (Retaining Wall), గ్రిల్స్, టైల్స్, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, రంగులు వేయడం, వ్యాయామశాల, ప్రహరీ గోడ తదితర పనుల పురోగతిని సమీక్షించారు.

బండ్ కింద ఏర్పాటు చేస్తున్న ఆహార విక్రయ కేంద్రాల (Food Zones) వద్ద కూర్చునేందుకు సీటింగ్‌ సదుపాయాలు, గోడలపై చిత్రలేఖనం, పచ్చదనం పెంపు, పిల్లల ఆటస్థలం వద్ద కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బండ్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆహార కేంద్రాలకు ఆకర్షణీయమైన రంగులు వేయించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరగా సమర్పించాలని ఆదేశించారు. బండ్ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనాన్ని పెంపొందించాలని, విద్యుత్ దీపాల ఏర్పాటు సహా వాటికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.


ఈ పరిశీలనలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు