ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై గండ్ర ఫోకస్!

29-10-2026 | 01:44pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు (Graduate Voter Registration) ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదు కార్యక్రమాల పురోగతిపై పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు (Graduate MLC Elections) బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవని అన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఇప్పటికే నమోదు చేసుకున్న ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.

ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నమోదు కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ అర్హులైన పట్టభద్రులు ఎవరూ ఓటరు నమోదుకు దూరం కాకుండా చూడాలని సూచించారు.

ఈ సమావేశంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, సీనియర్ నాయకులు సెగ్గం సిద్ధు, మేకల సంపత్ కుమార్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు