మల్లంపల్లి మండల అభివృద్ధికి సీతక్క కృషి అమోఘం...
కాంగ్రెస్ నేత మూల గణేష్ రెడ్డి
ములుగు, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి మండల అభివృద్ధికి మంత్రి సీతక్క(Minister Seethakka) చేస్తున్న కృషి అద్భుతమని (Congress Party) నేత మూల గణేష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ మల్లంపల్లి మండల కేంద్రంగా ప్రకటించడంలో సీతక్క ఎంతో కృషి చేశారని, అంతేకాక బిఆర్ఎస్ నేత కుసుమ జగదీష్ పేరును మల్లంపల్లి మండలానికి పెట్టడం సీతక్క మానవతా వాదానికి నిదర్శనం అన్నారు.
ఎంపీడీవో భవన నిర్మాణానికి కోటి 70 లక్షల రూపాయలు, ఎమ్మార్వో భవన నిర్మాణానికి రెండు కోట్ల 20 లక్షలు, మండలంలో సిసి రోడ్లకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత సీతక్కకి దక్కుతుందన్నారు. ఎస్సీ గ్రామపంచాయతీలు అభివృద్ధి కావాలని, రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా ముందుండాలని లక్ష్యంతో మల్లంపల్లి మండలానికి రెండు కోట్ల 27 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని తెలిపారు.
మంత్రి సీతక్క, డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ మండల అభివృద్ధికి కృషి చేస్తుంటే కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తూ అసత్యపు ఆరోపణలు, విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అటువంటి వ్యక్తులు ఇకనైనా తమ విధానాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా గణేష్ రెడ్డి సూచించారు.