పీవీసీ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు?

06-10-2026 | 03:10pm
  1. పంచాయతీల నుంచి కార్డులు వెనక్కి తీసుకున్న అధికారులు
  2. మేజర్ గ్రామపంచాయతీ మినహా ఇతర పంచాయతీల్లో పంపిణీ పూర్తి
  3. వెంకటాపురం మండలంలో జాప్యంపై ప్రజల్లో గుసగుసలు
  4. వెంటనే పంపిణీ చేయాలని మండల ప్రజల డిమాండ్

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 6 విజయ క్రాంతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పీవీసీ రేషన్ కార్డుల పంపిణీపై(PVC Ration Card Distribution) అయోమయం నెలకొంది. కొత్తగా ముద్రించిన పీవీసీ రేషన్ కార్డులను పంచాయతీల నుంచి అధికారులు వెనక్కి తీసుకున్నప్పటికీ, వాటి పంపిణీ మాత్రం పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీలో కార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

మండలంలోని పలు గ్రామపంచాయతీలకు పీవీసీ రేషన్ కార్డులు చేరగా, ఆయా ప్రాంతాల్లో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మాత్రం కార్డుల పంపిణీ జరగకపోవడంపై ప్రజల్లో చర్చ మొదలైంది.

◆పంచాయతీల నుంచి వెనక్కి తీసుకున్న కార్డులు

రేషన్ కార్డుల ముద్రణ అనంతరం వాటిని పంచాయతీలకు అందించి, అక్కడి నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు కార్డులను తిరిగి తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే తిరిగి తీసుకున్న కార్డులను ఎప్పుడు, ఏ విధంగా పంపిణీ చేస్తారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.

◆పాత కార్డులకే కొత్త ముస్తాబా?

కొత్త పీవీసీ రేషన్ కార్డుల పంపిణీలో జాప్యంపై మండల ప్రజల్లో పలు రకాల చర్చలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులనే పీవీసీ రూపంలోకి మార్చి కొత్తగా పంపిణీ చేయాల్సి ఉండగా, దీనికే ఇంత ఆలస్యం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. “పాత పెళ్లికి కొత్త ముస్తాబు” అన్నట్లుగా పాత కార్డులనే కొత్త రూపంలో ఇచ్చేందుకు ఇంత హడావుడి, ఇంత జాప్యం ఎందుకు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే కార్డుల పంపిణీ ఆలస్యానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

◆ప్రజలకు కావాల్సింది స్పష్టత

రేషన్ కార్డు అనేది పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత కీలకమైన పత్రం. రేషన్ సరుకుల పొందడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు కూడా ఇది అవసరమవుతుంది. అలాంటి కార్డుల పంపిణీ విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

ఇప్పటికే పలు పంచాయతీల్లో పంపిణీ జరిగిన నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా కార్డులను వెంటనే పంపిణీ చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కార్డులు సిద్ధంగా ఉంటే పంపిణీ ఎందుకు నిలిపివేశారో, ఏమైనా సాంకేతిక లేదా పరిపాలనా కారణాలు ఉంటే అవేమిటో అధికారులు ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు.

పీవీసీ రేషన్ కార్డుల పంపిణీపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేసి, లబ్ధిదారులకు ఇకనైనా కార్డులను అందజేస్తారా? లేక మరికొంత కాలం ప్రజలు ఎదురుచూడాల్సిందేనా? అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు