ప్రమాదాలకి నిలయంగా మూల మలుపు
కానరాని సూచిక బోర్డులు
పట్టించుకోని అధికారులు
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ఆ మూల మలుపు ప్రమాదాలకి నిలయంగా మారింది. మొన్నటి రోజు 2ద్విచక్ర వాహనాలు ఢీకొని 3గురు యువకులు మృత్యు ఒడి వరకు వెళ్లి వచ్చారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధవారం రోజున మిశినేని రాజు ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్ల పొదల్లో పడిపోయాడు.స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు.
ముప్పనపల్లి గ్రామ పరిధిలోని రహదారిపై ఉన్న మలుపు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూల మలుపు ప్రాంతంలో వాహనదారులకు రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మలుపు వద్ద రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల పొదలు దట్టంగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం ప్రమాదానికి కారణంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. రహదారి పక్కన ఉన్న చెట్ల పొదలను తొలగించి, మలుపు ప్రాంతంలో హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.