సింథటిక్ టెన్నిస్ కోర్టులో జిల్లా స్థాయి పోటీలు
క్రీడాకారులను అభినందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీనివాస్
మంథని,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా మంథని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోని సింథటిక్ టెన్నిస్ కోర్టులో అండర్–14, అండర్–17 బాలబాలికల టెన్నిస్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ వోడ్నాల శ్రీనివాస్(Manthani Municipal Chairperson Vodnala Srinivas) ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సుమారు 50 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని మంథని జోన్ కార్యదర్శి, పెద్దపల్లి జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి కనకొండ లక్ష్మణ్, నిర్వాహకులు కొమ్మురాజు శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో నిర్వహించే క్రీడా కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు నిర్వాహకులు అల్పాహారం అందించారు.