మట్టి వినాయకుడే మన సంస్కృతి..పర్యావరణానికి రక్షణ
ములుగులో లయన్స్ క్లబ్ పిలుపు
ములుగు, (విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణే(Environmental protection) లక్ష్యంగా ములుగు లయన్స్ క్లబ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్త(Pollution Control Board United) ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రసాయన రంగులు కలిగిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జలవనరులు కలుషితం అవుతున్న నేపథ్యంలో, ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మట్టి వినాయక విగ్రహాలను ములుగు జిల్లా కేంద్రంలోని ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ... మట్టి వినాయకుడే మన సంస్కృతి, మన పర్యావరణానికి రక్షణ అని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో కరగక చెరువులు, కుంటలు కలుషితం అవుతున్నాయి. మట్టితో చేసిన విగ్రహాలు సులభంగా నీటిలో కరిగిపోయి జలవనరులను కాపాడతాయి. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇది కేవలం పండుగ మాత్రమే కాదని, భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించే బాధ్యత అని పిలుపునిచ్చారు. పర్యావరణహితంగా పండుగను జరుపుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, లయన్ కొండి సాంబశివ జోన్ చైర్ పర్సన్, లయన్ ఆడెపు రాజు సెక్రటరీ, లయన్ చుంచు రమేష్, లయన్ దొంతి రెడ్డి బలరాం రెడ్డి, లయన్ సోమ నరసయ్య, లయన్ వెంకట్ రెడ్డి లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.