పొంగులేటికి కేసీఆర్‌కు పోలిక ఎక్కడిది?

15-09-2026 | 06:51pm

బీఆర్‌ఎస్‌ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలను ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఖండించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న పొంగులేటికి ఫామ్‌హౌస్‌లో గడిపిన మాజీ సీఎం కేసీఆర్‌(Former CM KCR)కు పోలిక ఎక్కడుందని ప్రశ్నించారు.

కేసీఆర్‌ హయాంలో తీసుకొచ్చిన ధరణి లోపభూయిష్టంగా ఉండటంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చి ప్రజల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 22ఏ సమస్య గత ప్రభుత్వం హయాం నుంచే కొనసాగుతోందని, దాని పరిష్కారానికి మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాక్‌ అసెంబ్లీ నిర్వహించడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వం, స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, పట్టణ మండల అధ్యక్షులు బోళ్ల సూర్యం, మండల రాము, కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు